గ్రేటర్ ఫైట్ ఎప్పుడు..?

గ్రేటర్ ఎన్నికలకు రెడీ అవుతోన్న వేళ భాగ్యనగరాన్ని ముంచెత్తిన వరదలు అధికార పార్టీని కలవరపెడుతున్నాయి. ఫీల్ గుడ్ వెదర్‎లో ఎన్నికలకు వెళ్లాలని భావించిన గులాబీ దళానికి వరద కష్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Update: 2020-10-23 15:52 GMT

గ్రేటర్ ఎన్నికలకు రెడీ అవుతోన్న వేళ భాగ్యనగరాన్ని ముంచెత్తిన వరదలు అధికార పార్టీని కలవరపెడుతున్నాయి. ఫీల్ గుడ్ వెదర్‎లో ఎన్నికలకు వెళ్లాలని భావించిన గులాబీ దళానికి వరద కష్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న అధికార పార్టీ నాయకులకు అడుగడుగునా ఎదురవుతున్న చేదు అనుభవాలే అందుకు శాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. దీంతో అనుకున్నట్లుగానే డిసెంబర్ రెండోవారం నాటికి జీహెచ్ఎంసి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందా లేదా అనే చర్చ మొదలైంది.

మరోవైపు 2021 ఫిబ్రవరిలో జీహెచ్ఎంసి పాలకమండలి గడువు ముగుస్తుంది. గత ఎన్నికల్లో రికార్డ్ లు బ్రేక్ చేస్తూ 99 డివిజన్లు గెలుచుకుని గ్రేటర్ పీఠాన్ని దక్కించున్న టిఆర్ఎస్.. మరోసారి తన పట్టును నిలుపుకోవాలని భావిస్తోంది. అందుకోసం ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడక ముందే ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయింది. ఇప్పటికే ఎన్నికల గ్రేటర్ ఫైట్ కోసం ఇంచార్జ్ లను నియమించి గేర్ మార్చి స్పీడుమీదున్న కారుకి కుండపోత వర్షాలు, వరదలు బ్రేకులు వేశాయి.

అయితే ఈ ఆపద సమయాన్ని సైతం సద్వినియోగం చేసుకునే పనిలో అధికార పార్టీ పడ్డట్లు కనిపిస్తోంది. వరద బాధితులకు ఆర్థిక సాయం అందించే పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం నీటమునిగిన కాలనీల్లో పర్యటనలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు అధికార ప్రతినిధులకు బాధితులు ఊహించని షాకులిచ్చినా ముందుకెళ్లాల్సిందేనన్న కేటీఆర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేటర్లు పనిచేస్తున్నారు.

అటు ముంపు ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణ సాయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 550 కోట్లలో నుంచి తక్షణం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రతి వరద బాధిత కుటుంబానికి అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం అందిస్తున్న పదివేల సహాయం తాత్కాలిక, తక్షణ సహాయం మాత్రమే అని, వరదల్లో ఇళ్లు పాక్షికంగా నష్టపోయిన వారికి 50వేలు, లేదా పూర్తిగా నష్టపోతే వారికి లక్షరూపాయల సహాయం అందిస్తామని హామి ఇస్తున్నారు.

ప్రస్తుతం గ్రేటర్ ప్రజలకు అందుతున్న ఆర్థిక సాయం ప్రభుత్వానికి వరంగా మారుతుందని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఇదే ఊపుతో బల్దియా ఎన్నికల విషయంలో రాజీపడకుండా ప్రజల్లో ఉండాలని చూస్తున్నారు. అటు ప్రగతిభవన్‎లో మంత్రి కేటీఆర్ వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తూ నేతల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. వచ్చేమూడేళ్లలో నగర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రచారం చేయమంటున్నారు. ఏదిఏమైనా గ్రేటర్ ఫైట్ పై వరద కష్టాలు ప్రభావం చూపితే మాత్రం పరిస్థితులు తారుమారవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News