Weather Report: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి తీవ్రత.. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి..
Weather Report: తెలుగు రాష్ట్రాలను చలి తీవ్రత వణికిస్తోంది. ఎముకలు కొరికే చలితో ప్రజలు వణికిపోతున్నారు.
Weather Report: తెలుగు రాష్ట్రాలను చలి తీవ్రత వణికిస్తోంది. ఎముకలు కొరికే చలితో ప్రజలు వణికిపోతున్నారు. డిసెంబర్ రెండవ వారం నుండే రికార్డుస్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత అనూహ్యంగా పెరగడంతో ప్రజలకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరికొన్నిరోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు.
సాయంత్రం అయ్యిందంటే చాలు ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాలకు ఇప్పటికే ఎల్లో వార్నింగ్ జారీ చేశారు. ఇక్కడ 3-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌లో గత దశాబ్దంలో ఇది రెండవ అత్యల్ప ఉష్ణోగ్రతలుగా నమోదయ్యాయి. పలు జిల్లాల్లో పగటిపూట కూడా చలిమంటలు వేసుకోవడం తప్పడంలేదు.
ఇక హైదరాబాద్ నగరవాసులను చలి బాధిస్తోంది. ఉదయం 8 గంటల వరకు రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున రోడ్లను మంచు కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్‌లో 5.2, మెదక్ 8.8, రామగుండం 9.2, హన్మకొండ10.1, దుండిగల్ 11.1, హాకీంపేట 13.3 భద్రాచలం 14.0డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత అధికంగా ఉన్న 11 జిల్లాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్టు హైదరాబాద్ వాతావరణ అధికారి నాగరత్న తెలిపారు.
ఇక ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజల్ని చలి గాలులు వణికించేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం అత్యల్పంగా విజయనగరంలో 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు, కృష్ణా, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోనూ చలి ప్రభావం అధికంగానే ఉంది. ఉదయం 10 గంటలైనా కొన్ని చోట్ల చలి తీవ్రత తగ్గడం లేదు. రాష్ట్రంలో డిసెంబరు 1 నుంచే చలి తీవ్రత అధికమైంది.
నవంబరు చివరి వారంతో పోలిస్తే సగటున 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. తర్వాత చలి ప్రభావం కాస్త తగ్గినా గత వారం రోజులుగా మళ్లీ పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. కనిష్ఠంగా విజయవాడలో 1970 డిసెంబరు 14న, 2010 డిసెంబరు 22న 13 డిగ్రీలుగా నమోదైంది. 2013 సంవత్సరంలో 14 డిగ్రీలు నమోదుకాగా ఇప్పుడు అదే స్థాయికి ఉష్ణోగ్రతలు తగ్గాయి.