Weather: తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు
Weather: ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు
Weather: తెలంగాణలో రుతుపవనాల ఎఫెక్ట్ కనిపిస్తోంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. దీనికి తోడు నిన్న ఉత్తర పశ్చిమ ద్రోణి, అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ ఛత్తీస్ఘడ్, విధర్బా, ఉత్తర మధ్య మహారాష్ట్ర మీదుగా అరేబియా సముద్రం వరకు విస్తరించాయి. దీంతో ఇవాళ ఆదిలాబాద్, కుమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలుపడే సూచనలున్నట్లు చెప్పారు.
ఇక రేపు ఆదిలాబాద్, కుమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించారు. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.