Rythu Bharosa : రైతు భరోసాపై బిగ్ అప్‌డేట్..వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం
Rythu Bharosa : రైతు భరోసాపై బిగ్ అప్ డేట్ వచ్చింది. అన్ని వర్గాల ప్రజల సూచనలు, సలహాలు స్వీకరించిన తర్వాతే రైతు భరోసా పథకం విధివిధానాలు రూపొందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
RYTHU BHAROSA SCHEME IN TELANGANA:రైతు భరోసా స్కీంపై బిగ్ అప్ డేట్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అన్ని వర్గాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించిన తర్వాతే రైతు భరోసా పథకం విధివిధానాలు రూపొందిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా కార్యశాలలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా కలెక్టరేటర్ లో బుధవారం నిర్వహించిన కార్యశాలకు మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ హోదాలో డిప్యూటీ సీఎం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేని శ్రీనివాసరెడ్డిలు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. ఈలోగానే రైతు భరోసా విధివిధానాలను ఖరారుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైనట్లు వివరించారు.
పంటపండించే ప్రతిరైతుకూ భరోసా కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశమన్నారు. గతంలో జరిగిన లోపాలు, ఆర్థిక నష్టం ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. ఆవిధంగా కాకుండా కష్టపడి పంటులు సాగు చేసే చిన్న, సన్నకారు రైతులకు చేయూతనిచ్చేలా కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. గత సీజన్ లో కొంత కష్టమైనా రూ. 7500 కోట్లను రైతులకు పెట్టుబడి సాయం కింద అందించిన విషయాన్ని గుర్తు చేశారు.