Allu Arjun Release: నేడు జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల..భారీగా చేరుకుంటున్న అభిమానులు
Allu Arjun Release: సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన కేసులో అరెస్టు అయిన సినీ నటుడు అల్లు అర్జున్ నేడు చంచల్ గూడ జైలు నుంచి రిలీజ్ కానున్నారు. ప్రస్తుతం ఆయన మంజీరా బ్యారక్ లో ఉన్నారు. ఆయన ఎప్పుడు విడుదల అవుతారా అని అభిమానులు భారీ సంఖ్యలో జైలు దగ్గరకు వస్తున్నారు. దీంతో వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అల్లు అర్జున్ కు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే 50వేల రూపాయల పూచీకత్తు చెల్లించాలని తెలిపింది. అలాగే దర్యాప్తు అధికారులకు సహకరించాలని..బాధితులతో ఎటువంటి సంప్రదింపులు, ప్రలోభాలు చేయకూడదని తెలిపింది.
కోర్టు తీర్పు కాపీని అల్లు అర్జున్ తరపు లాయర్లు రాత్రి 10గంటలకు చంచల్ గూడ జైలు అధికారులకు ఇచ్చారు. అయితే ఆ కాపీలో తప్పులు ఉన్నాయని జైలు అధికారులు చెప్పడంతో కొన్ని మార్పులను సూచించారు. ఆన్ లైన్ లో కూడా అప్పటికి కాపీ అప్ లోడ్ కాకపోవడంతో ఆయనను శనివారం ఫార్మాలిటీస్ పూర్తి చేసి..విడుదల చేస్తామని తెలిపారు. అయితే రాత్రి 10.30కు ఆన్ లైన్ లో కాపీ అప్ లోడ్ అయ్యింది.
అల్లు అర్జున్ నిన్న రాత్రి 8గంటలకు టీ, స్నాక్స్ తీసుకున్నారని..ఆ తర్వాత తనకు కేటాయించిన మంజీరా క్లాస్ 1 బ్యారక్ కు వెళ్లారు. రాత్రి అంతా కూడా ఆ బ్యారక్ లోనే ఉన్నారు. అల్లు అర్జున్ విడుదలైన ఈ కేసు ఆయన్ను వెంటాడుతూనే ఉంటుంది. పోలీసులు దర్యాప్తు కోసం పిలిచినప్పుడు ఆయన వెళ్లాలి. లేదా పోలీసులు ఆయన దగ్గరకు వెళ్లి ప్రశ్నిస్తారు. మరోవైపు ఆయన బయట ఉంటారు కాబట్టి ఈ కేసు నుంచి బయటపడేందుకు తనకున్న న్యాయపరమైన అవకాశాలను ఆయన పరిశీలించే అవకాశం ఉంటుంది.