Rumble Strips: వాహనదారులకు శాపంగా మారిన రంబుల్ స్ట్రిప్స్.. విరుగుతున్న డ్రైవర్ల వెన్నెముకలు
Rumble Strips: రహదారులపై వాహనదారుల స్పీడ్‌ను కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ వాహనదారులకు శాపంగా మారాయి.
Rumble Strips: రహదారులపై వాహనదారుల స్పీడ్‌ను కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ వాహనదారులకు శాపంగా మారాయి. ఈ రంబుల్ స్ట్రిప్స్‌పై వెళ్లిన తర్వాత కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. స్పీడ్‌ను కంట్రోల్ చేయడానికి ఏర్పాటు ఆ స్ట్రిప్స్.. ఒక్కోసారి ప్రమాదానికి కారణమవుతున్నాయి.
రంబుల్ స్ట్రిప్స్(Rumble Strips) అంటే రోడ్లపై వరుసగా ఉండే స్పీడ్ బ్రేకర్లు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు డ్రైవర్లను హెచ్చరించడానికి రంబుల్ స్ట్రిప్స్ వ్యూహాత్మకంగా రోడ్లపై ఏర్పాటు చేస్తుంటారు రోడ్డు భద్రతా అధికారులు. అయితే ఈ రంబుల్ స్ట్రిప్స్‌పై డ్రైవింగ్ చేయడం వల్ల వచ్చే వైబ్రేషన్‌లు వాహనదారుల వెన్నెముకను కుదిపేస్తున్నాయి. ఒక్క క్షణంలో 10 నుంచి 20 సార్లు కిందికి మీదికి కుదుపునకు గురవుతుండటంతో వాహనదారుల వెన్నుపూస దెబ్బతింటోంది. దీని వల్ల డ్రైవర్లు, వాహనదారులు దీర్ఘకాలిక నష్టాన్ని భరించాల్సి ఉంటుందని ఆర్థోపెడిక్ డాక్టర్లు చెప్తున్నారు. రంబుల్ స్ట్రిప్స్ వల్ల ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరింత దారుణంగా మారింది.
ద్విచక్ర వాహనాలే కాకుండా కార్లు, ఇతర భారీ వాహనాలు సైతం దెబ్బతింటున్నాయి. వీటి వలన రహదారులపై గుంతలు ఏర్పడుతున్నాయి. దీనిపై జీహెచ్ఎంసీ(GHMC)కి నిత్యం ఫిర్యాదులు అందుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు వరుస ఫిర్యాదులతో అప్పటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్(KTR) రంబుల్ స్ట్రిప్స్పై స్పందించారు. కొత్తగా ఏర్పాటు చేయొద్దని బల్దియాను ఆదేశించారు. నాటి ఇంజినీర్ ఇన్ చీఫ్ జియాఉద్దీన్ మే 16, 2023న మెమో జారీ చేస్తూ కొత్తగా రంబుల్ స్ట్రిపు ఏర్పాటు చేయొద్దంటూ జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లకు స్పష్టంచేశారు.
అయితే ప్రైవేటు కాంట్రాక్టర్ నిర్వహణలోని CRMP రోడ్లపై, పైవంతెనలు, ఇతర రహదారులపై కొన్ని నెలలుగా రంబుల్ స్ట్రిప్స్ ఇష్టానుసారంగా నిర్మాణమవుతున్నాయి. ఇటీవల నిర్మాణాలు అయిన ఎల్బీనగర్ బ్రిడ్జ్‌పై ఈ రంబుల్ స్ట్ర్రిప్స్ ఏర్పాటు చేశారు. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ సర్కిల్ కూడలికి ఇరువైపులా, ఉప్పల్ క్రికెట్ స్టేడియం రోడ్డు, సర్వే ఆఫ్ ఇండియా, హబ్సిగూడ, తార్నాక మధ్య దాదాపు ప్రతి 200ల మీటర్లకు ఒక రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. ఇక బయోడైవర్సిటీ కూడలి పైవంతెనపై, కూకట్‌పల్లి జాతీయ రహదారికి ఇరువైపులా దాదాపు 30చోట్ల రంబుల్ స్ట్రిప్స్ ఉన్నాయి.
ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం వాహనాల వేగాన్ని నియంత్రించడానికి రంబుల్ స్ట్రిప్స్ ఉపయోగించవచ్చని ఇంజినీర్లు చెబుతున్నారు. అవి 2.5మిల్లీమీటర్ల నుంచి 15 మిల్లీమీటర్ల ఎత్తుతో ఉండొచ్చని.. వరుసలు, వరుసల మధ్య దూరం కూడా ప్రమాణాలకు లోబడి ఉంటుందన్నారు. అయితే గుత్తేదారు సంస్థలు ఈ నిబంధనలేవీ పాటించడం లేదని ఆ రంబుల్ స్టిప్స్ ఏర్పాటులో ఇష్టానుసారంగా స్ట్రిప్స్ ఎత్తును పెంచడం వల్లనే వాహనదారులకు ఇబ్బంది అవుతుందని వాహనాలకు సమస్యలు వస్తున్నాయని ఇంజనీర్లు చెబుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న ఈ రంబుల్స్ స్ట్రిప్స్ వల్ల తమ వెన్నెముఖ దెబ్బతింటోందని వాటిని తొలగించాలని పలువురు డ్రైవర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల తమ ఆరోగ్యం వాహనం రెండు పాడవుతున్నాయంటున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికి వెళ్తే టెస్టుల రూపంలోనే తమ ఆదాయం అయిపోతుందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం నిర్మించాల్సిన రంబుల్ స్ట్రిప్స్ లను ఇష్టానుసారంగా ఎత్తు పెంచితేనే ప్రమాదం ఉంటుదని ఇంజనీర్లు చెబుతున్నారు. మరి ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్లను నిబంధనలు పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత తమపైనే ఉందన్న విషయాన్ని మరిచిపోతున్నారు అధికారులు. ఇకనైనా రూల్స్ పాటిస్తూ వాహనాదరుల సేఫ్టీ కోసం రంబుల్ స్ట్రిప్స్ వేయాలని వాహనదారులు కోరుతున్నారు.