Telangana Cabinet Expansion: ఆ నాలుగు జిల్లాలకు చోటు.. రేసులో ఉన్నది వీరే..

Telangana Cabinet Expansion: కేబినెట్ విస్తరణకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రంగం సిద్దం చేసుకుంటున్నారు.

Update: 2024-12-14 05:58 GMT

Telangana Cabinet Expansion: ఆ నాలుగు జిల్లాలకు చోటు.. రేసులో ఉన్నది వీరే..

Telangana Cabinet Expansion: కేబినెట్ విస్తరణకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) రంగం సిద్దం చేసుకుంటున్నారు. కేబినెట్ లో ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయమై అధిష్టానంతో ఆయన చర్చలు జరుపుతున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని నాలుగు జిల్లాలతో పాటు మూడు సామాజిక వర్గాలకు విస్తరణలో ప్రాధాన్యత దక్కనుంది. మంత్రి పదవుల కోసం ఆశావాహులు చివరి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మంత్రివర్గ విస్తరణలో నాలుగు జిల్లాలకు చోటు

రేవంత్ మంత్రివర్గంలో హైదరాబాద్(Hyderabad), రంగారెడ్డి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చోటు దక్కలేదు. ఈ నాలుగు జిల్లాలకు ఈసారి చోటు కల్పిస్తారు. దీంతో ఈ జిల్లాల నుంచి ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి కేబినెట్ లో చోటు ఖాయమని చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్ మధ్య పోటీ ఉంది. రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, టి. రామ్మోహన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మల్ రెడ్డి రంగారెడ్డి తనకు మంత్రి పదవి కోసం పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. పట్నం మహేందర్ రెడ్డికి మండలిలో కీలక పదవిని అప్పగించినందున ఆయనకు మంత్రి పదవి లేనట్టేనని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి దానం నాగేందర్, శ్రీగణేష్, అమీర్ అలీఖాన్, ఫహీం ఖురేషీ ల పేర్లు వినిపిస్తున్నాయి.

సామాజిక వర్గాలకు ప్రాధాన్యత

మంత్రివర్గ విస్తరణలో యాదవ, మున్నూరుకాపు, ముదిరాజ్, మైనార్టీలకు చోటు కల్పించే అవకాశం ఉంది. ముదిరాజ్ సామాజికవర్గం నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీహరి ఒక్కరే ముదిరాజ్ సామాజికవర్గానికి చెందినవారు. శ్రీహరికి కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. మున్నూరు కాపు నుంచి ఆది శ్రీనివాస్ కు విప్ పోస్టు దక్కింది. యాదవ లేదా కురుమ సామాజికవర్గం నుంచి కేబినెట్ లో ఎవరికి చోటు దక్కలేదు. దీంతో బీర్ల అయిలయ్య పేరును మంత్రివర్గంలోకి పరిశీలిస్తున్నారని చెబుతున్నారు.

ఇప్పటికే రేవంత్ కేబినెట్ లో నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల నుంచి ఇద్దరు మంత్రులున్నారు. ఖమ్మం నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. మహబూబ్ నగర్ నుంచి సీఎం రేవంత్ తో పాటు మరో మంత్రి పదవి దక్కింది. రేవంత్ కేబినెట్ లో ఏడుగురు ఓసీ సామాజిక వర్గానికి చెందినవారున్నారు. ఇద్దరు బీసీలు, ఇద్దరు ఎస్ సీలు, ఒకరు ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వారున్నారు.

మంత్రివర్గ విస్తరణలో రేసులో వీరే

మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బాలు నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల అయిలయ్య పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ నాయకత్వం హామీ ఇచ్చిందని చెబుతున్నారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న వెంకట్ రెడ్డి ఇప్పటికే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కింది.

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఇదే జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతికి కూడా మంత్రి పదవిని అడుగుతున్నారని ప్రచారం సాగుతోంది. బీసీ సామాజిక వర్గం నుంచి కేబినెట్ లో చోటు కోసం బీర్ల అయిలయ్య రేసులో ఉన్నారు. ఎస్టీ సామాజికవర్గం నుండి బాలు నాయక్ కూడా కేబినెట్ బెర్త్ కోసం చూస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కడియం శ్రీహరి పేరు కూడా తెరమీదికి వచ్చింది. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడంపై బీఆర్ఎస్ పై అప్పట్లో రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కేబినెట్ లో చోటు కల్పించకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సంక్రాంతిలోపుగా కేబినెట్ విస్తరణ

మంత్రివర్గ విస్తరణపై ఏకాభిప్రాయం కుదిరితే ఈ నెలాఖరు లోపుగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఆలస్యమైతే సంక్రాంతిలోపుగా విస్తరణను పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నారు. దిల్లీ పర్యటనలో కేబినెట్ విస్తరణపై సీఎం ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.

Tags:    

Similar News