New Menu: హాస్టల్ పిల్లలకు కొత్త మెనూ.. రెండు సార్లు మటన్.. నాలుగు సార్లు చికెన్
New Menu: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో కొత్త మెనూ ప్రారంభంకానుంది.
New Menu: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో కొత్త మెనూ ప్రారంభంకానుంది. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు రుచికరమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కొత్త మెనూను అందిస్తోంది. విద్యార్థులకు పౌషికాహారం అందేలా కొత్త మెనూ ఈ రోజు నుంచే అమలు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
ఇటీవల వసతి గృహాల్లో పౌష్టికార లోపం వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థతలకు గురైన ఘటనలు చాలానే జరిగాయి. దీంతో అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు విద్యార్థులకు పౌష్టికారం అందించాలని ఉద్దేశంతో కొత్త మెనూను ప్రారంభిస్తోంది. నెలకు రెండు సార్లు లంచ్‌లో మటన్, నాలుగు సార్లు చికెన్ పెట్టనున్నారు. ఇక మిగతా రోజుల్లో ఉడికించిన కోడి గుడ్డు, కిచిడీ, ఇడ్లీ, వడ, పూరి, బోండా, పులిహోరాతో పాటు రాగి జావ, పాలు వంటివి ఇవ్వనున్నారు.
ఇక బ్రేక్ సమయాల్లో ఏదైన పండుతో పాటు పెసర్లు, బటానీలు, మిల్లెట్ బిస్కెట్లు ఇవ్వనున్నారు. ఇలా ఒక్కో వారానికి ఒక్కో మెనూ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు ప్రభుత్వ హాస్టళ్లలో కేవలం చికెన్ మాత్రమే పెడుతున్నారు. కానీ ఇకపై నెలలో మొదటి, మూడో ఆదివారం మధ్యాహ్నం సమయంలో విద్యార్థులకు బగారా రైస్, మటన్ కర్రీ పెట్టనున్నారు. నెలలో మొదటి, మూడో బుధవారంతో పాటు రెండు, నాలుగో ఆదివారం బగారా రైస్ తో పాటు చికెన్ కర్రీ వడ్డించనున్నారు.
విద్యార్థులకు పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందించాలని ప్రభుత్వం భావించింది. ఉన్నతాధికారులతో కమిటీ వేసి కేవలం 15 రోజుల్లోనే నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం.. అధికారులు, నిపుణులతో సమావేశాలు నిర్వహించి మెనూ ఫిక్స్ చేసింది.