Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదం

Water Issue: జల వివాదం కాస్త.. విద్యుత్‌ వివాదంగా మారుతున్న వైనం

Update: 2021-06-29 04:04 GMT

కృష్ణ నది (ఫైల్ ఇమేజ్)

Water Issue: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. నిన్నటి వరకు నీటి వాటాల పంపకాల విషయంలో దుమ్మెత్తిపోసుకున్న రెండు రాష్ట్రాల గొడవ.. ఇప్పుడు మరో వివాదానికి కేంద్ర బింధువుగా మారింది. తాజాగా శ్రీశైలం ఎడమ కాలువ ద్వారా జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వొద్దంటూ ఏపీ కేఆర్ఎంబీకి లేఖ రాయడంతో నిలుపుదల చేయాలంటూ తెలంగాణ విద్యుత్ సంస్థలకు కృష్ణ రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన తెలంగాణ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు శ్రీశైలం బ్యాక్ వాటర్ వినియోగించుకోవాలంటూ జెన్‌కోకు జీవో జారీ చేసింది. దీంతో జల వివాదం కాస్త విద్యుత్ వివాదంగా మారింది.

ఏపీ ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కి.. కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టులు కడుతూ దక్షిణ తెలంగాణ ప్రాంతానికి నోరు కట్టే ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ఆరోపిస్తుంది. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా నదిపై అక్రమ కట్టడాలు కడుతు తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తున్నారు. ఎప్పటి నుంచో ఏపీలో అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను నిలిపి వేయాలంటూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల శక్తికి, కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. కానీ ఏపీ మాత్రం నోటితో మెచ్చుకుంటు నొసటితో వెక్కిరిస్తున్నట్లు వ్యవహరించడంతో వివాదం మరో వైపు టర్న్ అయ్యింది.

నీటి వాటాల విషయంలో వివాదం సద్దుమనగకముందే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం వాడుకుంటున్న నీటి వాటాను అపాలంటూ ఈ నెల 17న కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. దీంతో తక్షణమే బ్యాక్ వాటర్ వినియోగాన్ని నిలిపివేయాలంటూ కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఇచ్చిన వివరణతో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. శ్రీశైలం ఎడమ కాలువపై తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ నీటిని దిగువకు విడుదల చేసుకొని.. విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, దీనివల్ల తమ ప్రాంత ప్రాజెక్టులలో నీటి సామర్థ్యం తగ్గుతుందని ఏపీ చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని కొట్టి పారేస్తుంది తెలంగా సర్కార్. దీంతో ఇప్పుడు ఈ అంశం మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి తెర తీసింది. 

Full View


Tags:    

Similar News