కరోనా వస్తే వెలివేస్తారా? ఇదెక్కడి అమానుషం?
Adilabad: సాలెగూడకు చెందిన ఇంటర్ విద్యార్థికి కరోనా పాజిటివ్ * ఊళ్లోకి రానివ్వని గ్రామస్తులు
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిందనే కారణంతో ఒక బాలికను పది రోజులు ఊరి బయట ఉంచిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో చోటు చేసుకుంది. సాలెగూడకు చెందిన ఇంటర్ విద్యార్థికి పది రోజులు క్రితం కరోనా సోకింది. కాలేజీకి సెలవులు ఇవ్వడంతో ఇంటికి వెళ్లింది. కరోనా సోకిందని తెలుసుకున్న గ్రామస్తులు బాలికను ఊరి బయట ఒక గుడిసెలో క్వారంటైన్ ఏర్పాటు చేసి అందులో ఉంచారు.. విషయం తెలుసుకున్న వైద్యుల బృందం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
కరోనా సోకిన విద్యార్థిని ఊళ్లోకి రానివ్వకుండా అడ్డుకున్న ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయంశమైంది. మూఢనమ్మకాలతో గ్రామస్తులు ఆమెను ఊరి బయటే ఉంచడంతో బాలిక తీవ్ర మనస్థాపానికి గురైంది. తనకు పాజిటివ్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న గ్రామ పెద్దలు ఊళ్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ఊళ్లోకి అడుగుపెట్టొద్దంటూ హుకూం జారీ చేశారు. ఆమెతో పాటు తల్లిదండ్రులను పొలంలోకి తీసుకెళ్లి అక్కడే ఉంచారు గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం పట్ల బాలిక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.