20 ఏళ్లుగా బాలకార్మికులు లేని మండలంగా వేల్పూరు గుర్తింపు
Velpur: రెండు దశాబ్దాలుగా బాల కార్మికులు లేని మండలంగా జాతీయ స్దాయిలో గుర్తింపు పొందిన ఖ్యాతి ఆ మండలానిది.
Velpur: రెండు దశాబ్దాలుగా బాల కార్మికులు లేని మండలంగా జాతీయ స్దాయిలో గుర్తింపు పొందిన ఖ్యాతి ఆ మండలానిది. 100 శాతం అక్షరాస్యత సాధించాలనే తపనతో ఆ పల్లెవాసులు బాల కార్మిక వ్యవస్ధ నిర్మూలనకు నడుం కట్టారు. బాల కార్మిక వ్యవస్థలో మగ్గి బతుకులు బుగ్గి చేసుకునే వారిని గుర్తించి 20 ఏళ్లుగా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు ఆ మండల వాసులు.
నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం బాలకార్మికులు లేని మండలంగా జాతీయ స్దాయిలో గుర్తింపు సాధించింది. 20 ఏళ్ల నుంచి ఆ గుర్తింపును కాపాడుకుంటోంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2001లో ప్రత్యేక కార్యచరణను రూపొందించింది. పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని రెంజల్, ఎడపల్లి, నందిపేట్, వేల్పూర్ మండలాలను ఎంపిక చేశారు. వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఐదు నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న 398మంది బాల కార్మికులను అధికారులు గుర్తించి బడుల్లో చేర్పించారు.
గ్రామీణాభివృద్ధి కమిటీలు, స్థానిక ప్రజాప్రతినిధుల యువజన సంఘాల ప్రతినిధుల సహకారంతో అన్ని గ్రామాల్లో వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు, పశుపోషకులతో అవగాహన సమావేశం నిర్వహించారు. బడీడు పిల్లలను కార్మికులుగా మారిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. దీంతో బాల కార్మికులను చేర్చుకునేందుకు ఎవరూ సాహసం చెయ్యలేదు. ఇలా రెండు దశాబ్దాలుగా బాలకార్మికులు కనిపించకుండా చొరవ తీసుకుంటున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మరోసారి వేల్పూర్ పేరు తెరపైకి వచ్చింది.
జాతీయ బృందం వేల్పూర్ లో బాల కార్మిక వ్యవస్థను పరిశీలించింది. మండలంలో బాల కార్మికులు లేకుండా కృష్టి చేసిన అప్పటి ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, అధికారులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ సందర్భంగా అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అశోక్ కుమార్ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనను సన్మానించారు. వేల్పూర్ మండలం స్పూర్తితో జిల్లాలోని మిగతా మండలాలు తమ గ్రామాల్లో బాలకార్మిక వ్యవస్ధ నిర్మూలనకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.