షోరూం యజమానులతో అధికారుల కుమ్మక్కు..ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ లో అక్రమాలు!

Update: 2020-06-24 04:54 GMT

ప్రభుత్వ ఆశయాన్ని అధికారుల కమీషన్ల కక్కుర్తి నీరుగారుస్తోంది. అధికారుల ధనదాహం పంచాయతీలకు ఆర్థిక తంటాలు తెచ్చిపెడుతోంది. ట్రాక్టర్ కొనుగోలు కార్యక్రమాన్ని కొందరు అధికారులు కాసులు కురిపించే యంత్రంగా మార్చుకున్నారు. షోరూం యజమానులతో కమీషన్ మాట్లాడుకొని పంచాయతీలకు ట్రాక్టర్లను అంటగడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ట్రాక్టర్ కొనుగోలు అక్రమాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతీల ట్రాక్టర్లు, ట్యాంకర్ల కొనుగోలు కార్యక్రమంలో కమీషన్ల పర్వం వెలుగులోకి వచ్చింది. ట్రాక్టర్ల కొనుగోలు పేరుతో పైస్థాయి అధికారులు తమను బురిడి కొట్టించారని అశ్వారావుపేట మండలానికి చెందిన సర్పంచ్ లు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్లు రాకున్నా అధిక డబ్బు కట్టించారని సర్పంచ్ లు కలెక్టర్ ముందు వాపోయారు. దీంతో జిల్లాలో జరిగిన కమీషన్ల బాగోతం బయటపడింది.

సర్పంచ్ లతో సంబంధం లేకుండా ట్రాక్టర్ల కొనుగోళ్ల విషయంలో జిల్లాస్థాయి అధికారులే చక్రం తిప్పినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పలు కంపెనీలు, షోరూం ఓనర్లతో అధికారులు అగ్రిమెంట్ చేసుకొని సర్పంచులతో కొనుగోలు చేయించారు. పైగా సర్పంచ్ లను ఒప్పించాలని మండల స్థాయి అధికారులకు కూడా ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. దీంతో కింది స్థాయి అధికారులు, సిబ్బంది సర్పంచ్ లకు నచ్చజెప్పి ట్రాక్టర్లు కొనుగోలు చేయించారు.

జరిగిన బాగోతం బయటపడడంతో అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిబంధనల మేరకే కొనుగోలు చేశామని, జాయింట్ కలెక్టర్ తో కూడిన కమిటీ టెండర్ల ద్వారానే కొనుగోలు జరిగాయని చెబుతున్నారు. పైగా పంచాయతీ తీర్మాణాలతోనే ఈ ప్రక్రియ అంతా జరిగిందని అంటున్నారు. అయితే పూర్తిస్థాయి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని సర్పంచ్ లు కోరుతున్నారు.


Full View


Tags:    

Similar News