Telangana: దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నేడు పట్టణ ప్రగతి కార్యక్రమం
Telangana: తెలంగాణలో ఏర్పడిని తొమ్మిదేళ్లలో.. పట్టణాల్లో జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమాలు
Telangana: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నేడు పట్టణ ప్రగతిపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేళ్లలో... పట్టణాల్లో ఎలాంటి మార్పులు తీసుకువచ్చారు? పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎలాంటి మౌలిక వసతులు ఏర్పరిచారు? తెలంగాణ పట్టణాల అభివృద్ధికి ఏ విధంగా అడుగులు వేస్తోందనే దానిపై ప్రజలకు వివరించనున్నారు.
పట్టణాలు దేశ ప్రగతికి మెట్లు. చదువులు, జీవనోపాధి, ఆరోగ్య అవసరాల కోసం ప్రజలు పట్టణాలకు తరలివస్తుంటారు. దేశ జనాభాలో 35.1% పట్టణాల్లో నివసిస్తుండగా... తెలంగాణలో 47.6 % జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారు. పెరుగుతున్న జనాభా, మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టణాలు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టింది. 2020లో పట్టణ ప్రగతి పేరిట వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌తో పాటు అన్ని నగరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో రాష్ట్ర పట్టణాల రూపు రేఖలే మారిపోయాయి.
తొమ్మిదేళ్లలోనే తెలంగాణ పట్టణాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించి పురోగమిస్తున్నాయి. కేంద్రం నుండి 23 పట్టణ, స్థానిక సంస్థలకు స్వచ్ సర్వేక్షణ్ అవార్డులు, 3 పట్టణ, స్థానిక సంస్థలకు ఇండియన్ స్వచ్ఛత లీడ్ అవార్డులు లభించాయి. పట్టణీకరణలో దేశంలోనే తెలంగాణ రాష్ర్టం రెండవ స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్య సమితిలోని అర్బర్ డే ఫౌండేషన్, ఆహార, వ్యవసాయ సంస్థ వరుసగా రెండేళ్లు హైదరాబాద్‌ను ప్రపంచ వృక్ష నగరంగా గుర్తించింది. దక్షిణ కొరియాలోని జెజులో నిర్వహించిన అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తుల సంఘం... హైదరాబాద్‌కు ప్రపంచ హరిత నగరం-2022 అవార్డు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల బృందాలు తెలంగాణలో అధ్యయనం చేసే స్థాయికి రాష్ట్రం ఎదిగింది.
పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి చేపట్టిన పట్టణ ప్రగతి కోసం... రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 4వేల 537 కోట్లు విడుదల చేసింది. ఇందులో 4వేల 138 కోట్ల నిధులని ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టారు. మౌలిక సదుపాయాలు, రోడ్ల విస్తరణ, కాలువల నిర్మాణం, స్ట్రీట్ లైటింగ్, హరితహారం, డంపింగ్ యార్డ్స్, వైకుంఠ దామాలు, క్రీడా ప్రాంగణాలు, వెజ్ - నాన్ వెజ్ మార్కెట్ల సౌకర్యాలతో పట్టణాలు కళకళలాడుతున్నాయి. అనాథలకు ఆశ్రయం కల్పించేందుకు 30 షెల్టర్లను ఏర్పాటు చేశారు.
పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమం కింద 3వేల 618 వార్డుల్లో ఒక వేయి 612 నర్సరీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఏడాది నర్సరీలలో 248 లక్షల మొక్కలను పెంచుతున్నారు. 2వేల 818 పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా ఈ ఏడాది మార్చి చివరి నాటికి రోడ్లకు ఇరువైపులా 19.98 లక్షల మొక్కలను నాటారు. 2020 -21 నుంచి 2023 -24 వరకు మొత్తం 778 కోట్ల రూపాయల గ్రీన్ బడ్జెట్ ను కేటాయించారు. GHMC మినహా ఇతర పట్టణ, స్థానిక సంస్థల్లో చెత్త రవాణాకు 4వేల 713 వాహనాలు ఏర్పాటు చేసి రోజుకు 4వేల 356 టన్నుల చెత్తను తరలిస్తున్నారు. ఇందుకు వివిధ ప్రాంతాల్లో 141 డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేశారు. ఘన వ్యర్ధ పదార్ధాల నిర్వాహణకు 229 కంపోస్ట్ షెడ్స్ ఏర్పాటు చేసి ఎరువు తయారుచేస్తున్నారు. వంద శాతం చెత్తను సేకరిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.