Hyderabad: పరేడ్ గ్రౌండ్‌లో విమోచన దినోత్సవం.. జాతీయ జెండాను ఆవిష్కరించనున్న కేంద్రమంత్రి అమిత్‌షా
Telangana Liberation Day 2023: కవాతులో సాయుధ బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించనున్న షా
Telangana Liberation Day 2023: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవనాన్ని నిర్వహించనున్నారు. విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా.. పరేడ్ గ్రౌండ్ లో జాతీయజెండాను ఎగురవేయనున్నారు. కవాతులో సాయుధ బలగాల నుండి గౌరవవందనం స్వీకరించనున్నారు. అనంతరం హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించనున్నారు. చారిత్రక ఘట్టాలను ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు చోటుచేసుకోనున్నాయి. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, వెచ్చిస్తున్న నిధులు, సాధించిన ప్రగతిపై కేంద్ర మంత్రి అమిత్ షా నివేదిస్తారు.
నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలనుంచి విముక్తికి సంకేతంగా విమోచన దినోత్సవాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో భారత్ మిలిటరీ నిర్వహించిన ఆపరేషన్ పోలోతో నిజాం ఆఖరి పాలకుడు మిర్ ఉస్మాన్ అలీఖాన్ తలవంచిన చారిత్రక ఘట్టానికి సంకేతంగా తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నారు.