Vajra Buses: వజ్ర బస్సులను తుక్కుగా మారుస్తున్న ఆర్టీసీ

Vajra Buses: ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

Update: 2021-07-05 06:31 GMT

Vajra Buses: వజ్ర బస్సులను తుక్కుగా మారుస్తున్న ఆర్టీసీ

Vajra Buses: ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ముందస్తు ప్రణాళికలు లేకుండా అత్యధిక వ్యయంతో అప్పట్లో కొనుగోలు చేసిన వజ్ర ఏసీ బస్సులు ఇప్పుడు తుక్కుగా మారనున్నాయి. ప్రజలకు చేరువగా కాలనీల్లోకే వచ్చి ఎక్కించుకుని వెళ్లేందుకు వీలుగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రారంభించిన బస్సులు ప్రస్తుతం కొన్ని అమ్మివేయడంతో పాటు మరికొన్నింటిని స్ర్కాప్‌గా మార్చనున్నారు.

ప్రజలను ఇంటి వద్దే ఎక్కించుకోవడానికి 2017లో వజ్ర పేరుతో మినీ ఏసీ బస్సును రూపొందించింది తెలంగాణ ఆర్టీసీ. ఇప్పటికే డిపోలకు పరిమితమైన సుమారు వంద బస్సులు ఇకపై ప్రయాణీకులకు దూరం కానున్నాయి. ఉన్నవి ఉన్నట్టుగా అమ్మేయాలని ఆర్టీసీ నిర్ణయించడమే ఇందుకు కారణం. అమ్మకానికి వీలుగా కొన్నింటిని తుక్కుగా నిర్ధారిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు డిపోల ఆధీనంలో ఉన్న బస్సులను హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉన్న తుక్కు యార్డుకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

తొలిదశలో 65 బస్సుల్ని తుక్కు కింద ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయనున్నారు. ఆ తర్వాత మిగతా 35 బస్సుల్ని కూడా విక్రయించనున్నారు. ఐదేళ్ల క్రితం ప్రారంభమై ఇంకా కాలం తీరని బస్సుల్ని సరిగా నిర్వహించలేక వాటిని అమ్మేసేందుకు ఆర్టీసీ నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ బస్సుల్లో అధిక చార్జీలతో ఆదరణ తక్కువగా ఉండడంతో 2 సంవత్సరాల క్రితమే వాటిని డిపోలకు పరిమితం చేశారు. ఒక్కో బస్సుకు 18 లక్షల రూపాయలకు కొన్నారని కనీసం 3 లక్షల కిలోమీటర్లు కూడా నడవకముందే తుక్కుకు పంపించడం అంటే ప్రజాధనం వృధా చేసినట్టేనని జేఏసీ వైస్ చైర్మన్ హన్మంతు ముదిరాజ్ విమర్శించారు. లక్షలు పెట్టి కొని ఇప్పుడు ఆ బస్సులను తుక్కు కింద మార్చడంతో పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. వాటిని ఎలా వినియోగిస్తే బాగుంటుందో అనే అంశంపై సరైన కసరత్తు జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Tags:    

Similar News