ప్రధాన పరీక్షలను రీ-షెడ్యూల్‌కు TSPSC నిర్ణయం
* జూన్ 11న గ్రూపు-1 ప్రిలిమనరీ పరీక్ష
TSPSC Paper Leakage Case: TSPSC పేపర్ లీక్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసు విచారణలో సిట్ అధికారులు రోజుకో కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా గ్రూప్ - 2, గ్రూప్ - 4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేక వాయిదా పడతాయా? అనే టెన్షన్ అభ్యర్థుల్లో మొదలైంది. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా ఇప్పటికే పలు పరీక్షలను బోర్డు రీ షెడ్యూల్ చేసింది. కాగా.. గ్రూప్-2, గ్రూప్-4 ను కూడా రీ షెడ్యూల్ చేస్తుందా లేక అనుకున్న సమయానికి పరీక్షలు నిర్వహిస్తుందా అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
ప్రధాన పరీక్షలను రీ-షెడ్యూల్ చేయాలని TSPSC అధికారులు నిర్ణయించారు. దీనిపై కొంత కాలంగా కసరత్తు చేస్తున్న అధికారులు.. సోమవారం తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రద్దయిన పరీక్షలతో పాటు, ఇప్పటికే ప్రకటించి.. భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌లో కూడా మార్పులు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగా.. ప్రధాన పరీక్షలకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో రీ-షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. TSPSC పేపర్ లీక్ ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పేపర్ లీక్ ఘటనతో ఇప్పటికే నిర్వహించిన నాలుగు పరీక్షలను రద్దు చేశారు. మరో రెండు పరీక్షలను వాయిదా వేశారు. ఈ ఆరు పరీక్షల్లో ఒక్క గ్రూపు-1 ప్రిలిమనరీ పరీక్ష తేదీని మాత్రమే ప్రకటించారు. జూన్ 11వ తేదీన ఈ పరీక్షను నిర్వహించనున్నారు. మిగిలిన ఐదు పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయాల్సి ఉంది.
మే 17న జరగాల్సిన లైబ్రేరియన్స్, ఫిజికల్ డైరెక్టర్లు, ఏప్రిల్ 25న జరగాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్స్, మే 7న జరగాల్సిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్, మే 13న జరగాల్సిన పాలిటెక్నికల్ లెక్చరర్స్ వంటి పోస్టుల పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌లో కూడా కొన్ని మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. రద్దయిన ఐదు పరీక్షల తేదీలను ఖరారు చేయడానికి వీలుగా ఇప్పటికే ప్రకటించిన పరీక్షల్లో కూడా మార్పులు చోటుచేసుకోవచ్చని స్పష్టమవుతోంది. అలాగే.. గ్రూపు-3 పోస్టులకు సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించాల్సి ఉంది. ఈ పోస్టులకు కూడా భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దాంతో ఈ పరీక్ష నిర్వహణ సమయంలో ఇతర పరీక్షలు లేకుండా షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. గ్రూపు-2 పరీక్షను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. మారిన పరిస్థితుల్లో ఈ పరీక్ష తేదీల్లో కూడా మార్పులు చేయాలా? లేదా? అనే విషయంపై అధికారులు ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది.
అన్నింటి కన్నా ముఖ్యంగా గ్రూపు-4 పోస్టులకు జూలై 1న పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పోస్టుల కోసం తొమ్మిదిన్నర లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ స్థాయిలో అభ్యర్థులకు పరీక్షలను నిర్వహించడం అధికారులకు సవాల్‌గా మారింది. తొమ్మిదిన్నర లక్షల మందికి ఏకకాలంలో పరీక్ష నిర్వహించాలంటే.. అందుకు తగ్గట్లుగా పరీక్ష కేంద్రాలుండాలి. ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను కూడా ఆ స్థాయిలోనే ముద్రించాలి. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా.. దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు.. ఈ పరీక్షలన్నింటినీ వరుసగా నిర్వహిస్తే.. అభ్యర్థులకు ఇబ్బందులు వస్తాయా..? పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం సరిపోతుందా..? లాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని TSPSC ఎగ్జామ్స్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.