తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (టీఎస్ పాలిసెట్-2020) ఫలితాలు గురువారం వెలువడ్డాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ నాంపల్లిలోని తన కార్యాలయంలో ర్యాంకులు విడుదల చేశారు. ఈనెల 2వ తేదీన జరిగిన ప్రవేశ పరీక్షకు 56,814 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.polycetts.nic.inలోకి వెళ్లి ఫలితాలను చూసుకోవచ్చు.
కాగా.. టీఎస్ పాలిసెట్-2020 ప్రవేశాల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 12వ తేదీ నుంచి పాలిసెట్ మొదటి విడుత ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. 12 నుంచి 17వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 14 నుంచి 18వ తేదీ వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. 14 నుంచి 20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 22న సీట్ల కేటాయింపు జరగనుంది. ఇక సీట్లు సొందిన అభ్యర్థులు ఈ నెల 22 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ప్ రిపోర్ట్ చేయాలి. ఈ నెల 30 నుంచి పాలిసెట్ తుది విడుత ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. 30వ తేదీన, అక్టోబర్ 1న వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. అక్టోబర్ 3న తుది విడుత ప్రవేశాలకు సంబంధించి సీట్ల కేటాయింపు చేస్తారు. అక్టోబర్ 7 నుంచి పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రైవేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు అక్టోబర్ 8న మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.