కరోనా మహమ్మారితో విద్యా వ్యవస‌్థ అతలాకుతలం అయింది. ఎప్పుడో జూన్‌లో ప్రారంభం కావలసిన విద్యాసంవత్సరం సెప్టెంబర్‌లో మొదలైంది. దానితో పాటు కొన్ని తరగతులకు గత విద్యా సంవత్సరం ఫైనల్ పరీక్షలు కూడా పూర్తి కాలేదు. ఇలాంటి సమయంలో ప్రారంభమైన విద్యా సంవత్సరంలో సిలబస్‌ను తగ్గించనున్నారు. కరోనా మహమ్మారితో వచ్చిన సిలబస్‌పై hmtv స్పెషల్ స్టోరీ.
కరోనా వైరస్ ఈ విద్యాసంవత్సరంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ మహమ్మారి కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 21 నుంచి స్కూళ్లు, జూనియర్ కాలేజీలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పక్కాగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాల్సిన అవసరంలేదు ఆన్‌లైన్ క్లాసులు వినే విధంగా వెసులుబాటు కల్పించారు. ఇక, సిలబస్ తగ్గించుకునేందుకు ఇంటర్ బోర్డుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కరోనా కారణంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సిలబస్‌ను రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం తగ్గించింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. సీబీఎస్‌ఈ సూచనల ప్రకారం ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు, రెండవ సంవత్సరంలో హిస్టరీ, ఏకనామిక్స్, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫ్రీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, అకౌంటెన్సీ సబ్జెక్ట్‌ల్లో 30 శాతం, తగ్గించారు. అయితే ఈ తగ్గించిన సిలబస్ 2020-21 సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
కరోనాను నివారించేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా, దేశ వ్యాప్తంగా నాలుగు నెలల తరగతులు నిర్వహించలేకపోయారు. ఈ విధంగా జీరో ఇయర్ చేయడం ద్వారా విద్యార్థులు ఇక సంవత్సర కాలాన్ని పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. విద్యార్దులు కూడా సిలబస్‌ను తగ్గించాలని కోరుతున్నారు. ఈ సమయంలో సిలబస్ వంద శాతం ఉంటే తాము చదవడం కష్టమని వాపోతున్నారు. తమలో చాలా మందికి ఆన్‌లైన్ క్లాసులు అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని అయినా ఎలాగో అలాగా నెట్టుకొస్తున్నామని చెబుతున్నారు. సాధారణంగా ఒక విద్యా సంవత్సరంలో 220 పని దినాలు రావాల్సి ఉంటుంది. కాని సెప్టెంబర్ 5 నుంచి కాలేజీలు ప్రారంభిస్తే.. 175 పని దినాలే వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇంటర్మీడియట్ లాగానే పాఠశాల విద్యలో కూడా సిలబస్ తగ్గించాలి అనేది అందరి మాట.