రేపు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డేను ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాటు చేస్తున్నాయి. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కోటి వృక్షార్చణకు స్వీకారం చుడుతుండగా, బల్కంపేట ఎల్లమ్మకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్వంలో అమ్మవారికి బంగారు చీర బహుకరించనున్నారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రగతి భవన్ లో ఒక రోజు ముందే పండుగ వాతావరణం నెలకొంది.
రేపు టీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే. తమ నాయకుడి 67వ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 'కోటి వృక్షార్చన' పేరుతో కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17న ఒకే రోజు కోటి మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలందరూ తమ వంతు సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
కేసీఆర్ పుట్టిన రోజు పురష్కరించుకుని హైదరాబాద్ లోని వివిధ ఆలయాల్లో టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. బల్కంపేట ఎల్లమ్మ దేవికి బంగారు చీరను సమర్పించనున్నారు. దాతల సహకారంతో రెండున్నర కేజీల బంగారంతో రూపొందించిన చీరను అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బహుకరించనున్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జలవిహార్‌లో ఘనంగా జరగనున్నాయి. ఉదయం పదిన్నరకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో కేసీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయ ప్రస్తానం, తెలంగాణా ఉద్యమ నేపధ్యంతో త్రీ డీ గ్రాఫిక్స్ తో రూపొందించిన 30 నిమిషాల డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఒక్క రోజు ముందే ప్రగతి భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. వికలాంగులకు ట్రై సైకిళ్లు, ఇతర వస్తువులను హోం మంత్రి మహమూద్ అలీ అందజేశారు. రేపు టీఆర్ఎస్ యూత్ విభాగం మెగా రక్తదానం శిబిరాన్ని నిర్వహించనుంది.