టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా..

Update: 2020-06-13 10:27 GMT
Representational Image

టీఆర్ఎస్ శ్రేణుల్లో కరోనా వైరస్ కలకలం రేపుతుంది. ఓ వైపు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కరోనా భయంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. మరోవైపు జనగామ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఏకంగా కరోనా పాజిటివ్‌ రావడంతో ఆస్పత్రిలో వైద్యం అందుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇక ఈ విషయంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సతీమణి పద్మలతా రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వాట్సప్‌ వాయిస్‌ రికార్డు ద్వారా ఓ ప్రకటన చేశారు. కొంత కాలంగా ఎమ్మెల్యే అనారోగ్యంతో బాధపడుతున్నారని శుక్రవారం హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఆయన ఆరోగ్యంపై స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని తెలిపారు.

మరో వారంలో ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే డిశ్చార్జ్‌ అవుతారని చెప్పారు. ఎమ్మెల్యేకు వైరస్‌ సోకడంతో అధికారులు సూచనల మేరకు తమ కుటుంబ సభ్యులంతా పరీక్షలు చేయించుకున్నామని, వాటి రిపోర్టు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి తామంతా స్వీయ నిర్బంధంలో ఉన్నామని తెలిపారు. ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని పద్మలతా సూచించారు. తమ నాయకుడి ఆరోగ్యంపై ఆరా తీస్తున్న కార్యకర్తలు, అభిమానులందరికీ ఆమె క్షతజ్ఞతలు తెలిపారు. కాగా తెలంగాణలో కరోనా బారినపడిన తొలి ఎమ్మెల్యే ముత్తిరెడ్డినే కావడం గమనార్హం.

Tags:    

Similar News