కేంద్రం ప్రభుత్వం తీసుకురానున్న విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ బిల్లును పార్లమెంట్ లో పాస్ కానివ్వకుండా పోరాడుతామని తెలిపారు. ఉమ్మడి జాబితాలోని అంశాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేంద్రం మరింత ముందుకు వెళ్లితే తానే కార్యాచరణ రూపొందించి ఫైట్ చేస్తానన్నారు. కేంద్రం తీసుకువచ్చే విద్యుత్ చట్ట సవరణ బిల్లులో ఏముంది అనే దానిపై హెచ్ ఎం టివి స్పెషల్ స్టోరి.
కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లనున్న విద్యుత్ రంగం. విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లును తీసుకురానున్న కేంద్రం. సబ్ లైసెన్స్ లు, ఫ్రాంచెజీలు నియమించుకునేందుకు డిస్కంలకు అనుమతి. కేంద్రం ద్వారానే ఈఆర్సీల చైర్మెన్, సభ్యుల నియామకం. పీపీఏల అమలు పర్యవేక్షణ కోసం కొత్త సంస్థ ఏర్పాటు. కరెంట్ పై కేంద్రం పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు. విద్యుత్ సవరణ బిల్లును అడ్డుకుంటామని హెచ్చరిక.
ఉమ్మడి అంశాల్లో ఉన్న జాబితాపై కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. కొన్ని రంగాలను కేంద్రం తన పరిధిలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తునే ఉంది. త్వరలో మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకు షాక్ ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంపై పూర్తి అజామాయిషీని కేంద్రం తన చెప్పుచేతుల్లోకి తీసుకెళ్లేలా ప్రయత్నం చేస్తుంది.
రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసేలా చర్యలు తీసుకుంటున్నారని కేంద్రం వాదిస్తోంది. రాష్ట్రాల చర్యలకు అడ్డుకట్ట వేసి విద్యుత్ రంగాన్ని కాపాడాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం విద్యుత్ చట్టంలో పలు సవరణలను తీసుకురానుంది. రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసేలా పలు నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది.
జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ గా - కొందరు విద్యుత్ రంగ నిపుణులతో కమిటీని కేంద్రం వేస్తుంది. ఈ కమిటీ రాష్ట్రాల ఈఆర్సీ చైర్మన్ లను, సభ్యుల పేర్లను సిఫార్సు చేస్తే, కేంద్రం నియమిస్తుంది. పారిశ్రామిక రాయితీలు, ఎస్సీ - ఎస్టీల గృహాలకు ఉచిత విద్యుత్ రాయితీలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి అని చట్టంలో ఉన్నట్లు సమాచారం. ఈ చర్యలతో చర్యలు డిస్కమ్ లు బలపడతాయని కేంద్రం భావిస్తోంది.
కాంట్రాక్టు ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ అథారిటీ ఏర్పడితే రాష్ట్రాలు పీపీఏలను పున:సమీక్షించేందుకు ఆస్కారం ఉండదు. కేంద్ర విద్యుత్ చట్టం 2003కు పలు సవరణలను ప్రతిపాదిస్తూ రూపొందించిన విద్యుత్ చట్టం సవరణల ముసాయిదా బిల్లు-2020 పై 21 రోజుల్లో అభ్యంతరాలు, సలహాలు సూచనలు తెలియజేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. కరెంట్ పై కేంద్రం పెత్తనాన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
కేంద్రం తీసుకువచ్చే విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లు ద్వారా రాష్ట్రాల అధికారాలకు కత్తెర పడనుంది. ఈఆర్సీ చైర్మెన్, సభ్యుల నియామకం విషయంలో రాష్ట్రాల అధికారం పోతుంది. పీపీఏల అమలును పర్యవేక్షించేందుకు ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆథారిటీ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పునరుత్పాదక ఇంధనం కొనకుంటే జరిమానా, ఈఆర్సీ నిర్దేశించిన మొత్తంలో ప్రతి ఏటా డిస్కంలు పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిందేనని కేంద్రం అంటోంది. నిర్దేశించిన పరిమాణం కన్నా తక్కువగా కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన ప్రతి యూనిట్‌కు 50పైసలు చొప్పున డిస్కంలు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న డిస్కంలకు ఈ నిబంధన పెను భారంగా మారే ప్రమాదముంది.
విద్యుత్ సరఫరాకు డిస్కంలు చేస్తున్న మొత్తం ఖర్చులను రాబట్టుకునేలా విద్యుత్ టారీఫ్ ఉండాల్సిందేనని విద్యుత్ చట్ట సవరణ బిల్లులో ఉంది. సబ్సిడీని డైరెక్ట్ గా వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ తరహాలో నగదును బదిలీ చేయనున్నారు. ఇప్పుడు గృహ వినియోగదారులకు 1.45 పైసలు నుంచి 4.50 వరకు వినియోగం ఆధారంగా సబ్సిడీతో బిల్లులు వేస్తున్నారు. ఇకపై పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. సుమారు 7రూపాయల వరకు యూనిట్ ధర పెరగనుంది. ఈ బిల్లును తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో 24 గంటలు ఉచిత విద్యుత్ సాగు రంగానికి ఇచ్చే అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సవరణ బిల్లును గట్టిగా పార్లమెంట్ లో వ్యతిరేకిస్తామని అంటున్నారు. విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లుపై కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలు తప్పవని అంటున్నారు విద్యుత్ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.