ఫోకస్ అంతా ఎమ్మెల్సీ ఎన్నికలపైనే.. యూత్‌కు ప్రయార్టీ ఇవ్వాలన్న కేటీఆర్..
యువతలో పట్టు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలన్న ఆరాటాలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవడమే కాదు.. కొత్త స్థానాన్ని కొట్టేయాలని గులాబీ క్యాంప్ కసరత్తు చేస్తుంది. మొత్తం వ్యవహారాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తానై పర్యవేక్షిస్తున్నారు. ఓటర్ నమోదు నుంచి గతానికి భిన్నంగా ప్లాన్ చేశారు. యువతలో కానీ, నిరుద్యోగుల్లో కానీ వ్యవతిరేకత లేదని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ఓ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేసిన అధికార పార్టీ మరో స్థానంలో ఎవరిని నిలబెట్టాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది.
సగం తెలంగాణ మొత్తం ఎన్నికల్లో పాల్గొనే పట్టభద్రుల ఎన్నికల్లో సత్తా చాటడానికి అధికార పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. తన ఫోకస్ అంతా గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపైనే పెట్టింది. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భేటీ అయ్యి అనుసరించాల్సిన ప్యూహాలపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పార్టీలోని యూత్‌కు ఎక్కువ ప్రయార్టీ ఇవ్వాలన్న కేటీఆర్ వారి ఓట్లన్నీ టీఆర్ఎస్ అభ్యర్థికే పడేలా చూడాలన్నారు.
ఇక ఖమ్మం వరంగల్ నల్గొండ స్థానంలో అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వడంతో ఓటర్లను ఆకర్షించే ప్రత్యేక ప్యూహాలకు పదును పెడుతుంది గులాబీదళం. ఈ స్థానం నుంచి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమ, బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. ఒకవేళ హస్తం పార్టీ కోదండరామ్‌కు మద్దతిస్తే టగ్ ఆఫ్ వార్‌కి అవకాశం ఉండేది. కానీ ఎవరికి వారు ఉమ్మడి అభ్యర్ధిని నిలబెడుతుండటంతో ఫైనల్‌గా తమకే లాభం చేకురుతుందని లెక్కలేస్తుంది అధికార పార్టీ.
మొత్తానికి వరంగల్ ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీతో పాటు ఇటు హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి జిల్లా అభ్యర్థిపై త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ తుది నిర్ణయానికి రానట్లు తెలుస్తుంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ వామపక్షాల అభ్యర్ధిగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇక్కడ పరిస్థితిని బట్టి నాగేశ్వర్‌కి మద్దతిచ్చే విషయంపైనా ఆలోచిస్తుందనే చర్చ కూడా ఉంది. చూడాలి మరి. అధికార పార్టీ వ్యూహం ఏ మేరకు కలిసి వస్తుందో!!