హనుమకొండ జిల్లా పెద్దకొడెపాకలో అరుదైన మందారం
* ఒకే రోజు మూడు రంగులు మారుతున్న మందార పువ్వు.. తెలుపు, గులాబీ, ఎరుపు రంగులతో ఆకట్టుకుంటోన్న మందారం
Tricolor Hibiscus: ప్రకృతిలో కనిపించే ప్రతీ దృశ్యం అందంగానే ఉంటుంది. చెట్లు, చేమలు, నింగి, నేల ఇలా చూడాలే కానీ ప్రతీ దగ్గర సుందరమైన ప్రకృతి..తన అందాలను కనువిందు చేస్తూనే ఉంటుంది. ఇలాగే హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో కనిపిస్తున్న ఓ పువ్వు అందమైన అరుదైన పువ్వుగా చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటోంది. పెద్దకొడెపాక గ్రామానికి చెందిన వన ప్రేమికుడు కోమనేని రఘుకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష‌్టం. అలా అతని ఇంటి ఆవరణలో వికసించిన మందారం ఒకే రోజు మూడు రంగులలో మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉదయం తెల్లగా, మధ్యాహ్నం గులాబీ రంగులో, సాయంత్రం ఎరుపు రంగులోకి మారుతుంది. దీనిని మందార ముటాబిలిస్, కాన్ఫెడరేట్ గులాబీ, డిక్సీ రోజ్‌మల్లో, కాటన్ రోజ్ లేదా కాటన్ రోజ్‌మల్లో అని కూడా పిలుస్తారట. ఇది ఎక్కువగా దక్షిణ చైనా, తైవాన్ దేశాలలో కనిపిస్తూ ఉంటుంది.