Nizamabad: రైతులకు నాసిరకం విత్తనాలు అంటగడుతున్న వ్యాపారులు
Nizamabad: రూరల్ నియోజకవర్గాల్లో ఎర్రజొన్న సాగు * రైతులతో బై బ్యాక్ ఒప్పందాలు చేసుకుంటున్న కంపెనీలు
Nizamabad: ఆ జిల్లాలో బై బ్యాక్ ఒప్పందం రైతన్నల నడ్డి విరుస్తోంది. అన్నదాతల కంట కన్నీరు పెట్టిస్తోంది. రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయకుండా సీడ్ వ్యాపారులు చేతులెత్తేస్తుండటం వివాదంగా మారుతోంది. సీడ్ వ్యాపారులు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా ఎర్రజొన్న రైతులు లబోదిబోమంటూ రోడ్డెక్కుతున్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బాల్కోండ, రూరల్ నియోజకవర్గాల్లో రైతన్నలు ఎర్రజొన్న సాగు చేస్తారు. ఆర్మూర్ కేంద్రంగా ఉన్న విత్తన కంపెనీలు రైతులకు విత్తనాలు ఇచ్చి పంట కొనుగోలు చేస్తామని బై బ్యాక్ ఒప్పందం చేసుకుంటాయి. కొందరు వ్యాపారులు రైతులకు నాసిరకం విత్తనాలు అంటగట్టి చేతులెత్తేస్తుండగా మరికొందరు వ్యాపారులు బై బ్యాక్ ఒప్పందం ప్రకారం పంట కొనేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా రైతులు వ్యాపారుల ఇంటి ఎదుట ఆందోళనకు దిగుతున్నారు.
కొద్ది రోజుల క్రితం మోర్తాడ్ మండలం షట్పల్లిలో ఎర్రజొన్న వ్యాపారి ఇంటి ఎదుట నష్టపోయిన రైతులు బైఠాయించారు. బై బ్యాక్ ఒప్పందం ప్రకారం పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా నందిపేట మండలం మారంపల్లి రైతులు. నిత్యా బయోటెక్ ఎదుట ధర్నా చేపట్టారు. నాసిరకం విత్తనాలు ఇచ్చి సీడ్ యజమాని తమను నట్టేట ముంచాడని ఆరోపించారు. రెండు రోజుల పాటు ఆందోళన చేసిన రైతులు సీడ్ వ్యాపారితో నష్టపరిహారం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
వ్యవసాయ శాఖ అదికారుల అజమాయిషీ లేకపోవడంతో రైతులకు నాసిరకం విత్తనాలు అంటగట్టి నిలుపుదోపిడి చేస్తున్నారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లికి చెందిన సీడ్ కంపెనీ యజమాని. తమ కంపెనీ విత్తనాలు సాగు చేస్తే ఎకరాకు 16 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని నమ్మపలికారు. ఆశతో సాగు చేసిన రైతులకు ఎకరానికి 4 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి రావడంతో అవాక్కయ్యారు. తమకు నాసిరకం విత్తనాలు ఇచ్చారంటూ కంపెనీ ఎదుట బైఠాయించారు. యజమానితో చర్చలు జరిపి నష్టపరిహారం కోసం పోరాడి విజయం సాధించారు.
ఇప్పటికైనా నకిలీ విత్తనాలు సరఫరా చేసే వ్యాపారులపై వ్యవసాయశాఖ తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే, బై బ్యాక్ ఒప్పందాన్ని ఉల్లంఘించే వ్యాపారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.