TPCC Chief : జీవన్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి
TPCC Chief * 40 ఏళ్లుగా మచ్చలేని నాయకుడిగా ప్రాచుర్యం * 1981లో మాల్యాల పంచాయితీ సమితి ప్రెసిడెంట్ గా ఎన్నిక * 2 సార్లు మంత్రిగా చేసిన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి
తాటిపర్తి జీవన్ రెడ్డి తెలంగాణా రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కరలేని కరడుగట్టిన సీనియర్ కాంగ్రెస్ నేత. 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో మచ్చలేని నాయకునిగా ప్రాచుర్యం పొందిన జీవన్ రెడ్డికి పుట్టిన రోజు కానుకగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్ష పదవిని బహుమానంగా ఇవ్వనుందా? అనే ప్రశ్నకు ఔననే సమాచారం వస్తోంది.
1981లో రాజకీయాల్లో ప్రవేచించిన "జీవన్" మల్యాల పంచాయితీ సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికై అంచెలంచెలుగా ఎదిగారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి ప్రస్తుతం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా కొనసాగుతున్నారు. తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా జీవన్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఖరారు చేసిందనే వార్తల సంగతి ఎలా ఉన్నప్పటికీ, యాధృచ్ఛికంగా ఆయన బర్త్ డే కూడా కలసి రావడం విశేషంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.
టీ-పీసీసీ అధ్యక్షుని ఎంపికపై రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరుల పేర్లను ఉటంకిస్తూ వార్తలు వస్తున్న నేపథ్యంలోనే జీవన్ రెడ్డి పేరు ఖరారు కావడం గమనార్హం. మంగళవారం మధ్యాహ్న సమయంలో ఈ అంశంలో సోనియాగాంధీ తుది నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. అయితే పీసీసీ అధ్యక్షునిగా జీవన్ రెడ్డి ఎంపికకు సంబంధించి నియామక పత్రంపై సోనియాగాంధీ సోమవారం రాత్రే సంతకం కూడా చేశారనేది తాజా సమాచారం.
ఈ విషయంలో వారం రోజుల క్రితమే జీవన్ రెడ్డినీ పార్టీ అధిష్టానం పిలిపించుకుని చర్చించినట్లు సమాచారం. అర్జంటుగా ఢిల్లీకి రావలసిందిగా రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఫోన్ చేయగ, ఈమేరకు జీవన్ రెడ్డి ఢిల్లీ కూడా వెళ్లి వచ్చారని ఆయన అనుయాయులు చెబుతున్నారు.
అయితే పార్టీ నిర్వహణకు అవసరమైన ఆర్థిక బలం అనే అంశంపైనా పార్టీలో చర్చ జరిగినట్లు సమాచారం. జీవన్ రెడ్డి మంచి ప్రజానాయకుడిగా పేరు గాంచినప్పటికీ, పార్టీ నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరుల అంశం ప్రస్తావనం కూడా వచ్చిందంటున్నారు. అయితే కొందరు నాయకులు అండగా ఉంటారని పార్టీ ముఖ్యులు భావించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో జీవన్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్ గా ఎంపిక పూర్తయిందని, ప్రకటన లాంఛనమేనంటున్నారు.