తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 6 నుంచి ఆక్టోబర్ 5 వరకు తొలి విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో 30 రోజుల పాటు నిర్వహించారు. ఇదే నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,751 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పంచాయతీరాజ్‌శాఖ సన్నద్ధమైంది. ఈ సందర్భంగా పల్లెల్లో పలు అభివృద్ది పనులను చేపట్టి వాటిని పూర్తి చేశారు. ప్రభుత్వం నేటి నుంచి రెండో విడత 'పల్లె ప్రగతి' కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. ఈ నేపథ‌్యంలోనే అధికార యంత్రాంగం పూర్తిగా పల్లెబాట పడుతోంది. జనవరి 2 గురువారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో జరగనుంది. ఈ 11 రోజులు అధికారులు, పాలకవర్గాల తమ పనులతో గ్రామాలను అభివృద్ది చేయనున్నారు. గతేడాదిలో గ్రామాల్లో అమలు చేసిన కార్యాచరణనే ఈసారి కూడా ఆచరించనున్నారు.
గతేడాది కంటే ఈ ఏడాది గ్రమప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాలన్నింటిని పర్యవేక్షించడానికి ఇక ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. వీరి పర్యవేక్షణలోనే పల్లె ప్రగతిని నిర్వహించాలని నిర్దేశించనుంది. ఈ నేపథ్యంలోనే 51 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు నియమించింది. వీరికి మండలాలను కేటాయించింది. కేటాయించిన మండలాలను ఆకస్మికంగా సందర్శించి పనుల నిర్వహణ తీరును పరిశీలించాలని తెలిపింది. అనంతరం అధికారులు గుర్తించిన పనులు, నిధులు, విధుల నిర్వహణలో స్థానిక పంచాయతీ సిబ్బంది, పాలకవర్గం పనితీరుపై ప్రభుత్వానికి నివేదికను అందించాలని తెలిపారు. ఈ నివేదిక ఆధారంగానే ఏయే పంచాయితీలు బాగా పనులను నిర్వహించాయని తెలుస్తుంది. ఈ పనిలో అలసత్వం ప్రదర్శించినట్టయితే చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ రోజున మొదలయ్యే పల్లె ప్రగతి కార్యక్రమంలో మొదటి విడత ప్రగతి నివేదికను గ్రామస్తుల ముందుంచనున్నారు.