CM KCR: నేడు ప్రగతిభవన్‌లో అఖిలపక్ష సమావేశం

CM KCR: సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకంపై భేటీ * అన్ని పార్టీల దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానం

Update: 2021-06-27 05:50 GMT

ప్రగతి భవన్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: దళిత సాధికారత పథకం అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించిన సర్కారు... విధివిధానాల ఖరారుకు సిద్ధమైంది. ఇందుకోసం సీఎం కేసీఆర్​... ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఎస్సీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు పరచబోతున్న... 'సీఎం దళిత్ ఎంపవర్ మెంట్​'' పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. కాసేపట్లో ప్రారంభం కానున్న అఖిలపక్ష సమావేశం సుదీర్ఘంగా సాగనుంది.

ప్రగతిభవన్ వేదికగా జరిగే సమావేశంలో రాష్ట్రంలోని ఎస్సీ ప్రజాప్రతినిధులతో పాటు ఎంఐఎం, బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీల నేతలను కేసీఆర్‌ ఆహ్వానించారు. అదే విధంగా ఎస్సీ సమస్యల పట్ల అవగాహన ఉండి, ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న... రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకులను కూడా ఆహ్వానించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో అధికారులతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా సమావేశానికి రానున్నారు. ఎస్సీల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా క్షుణ్ణంగా చర్చించి.... వారి అభిప్రాయలు తీసుకొని.... విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం భావిస్తున్నారు.

కలెక్టర్లు, అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలోనూ.. దళిత సాధికారత పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆలోచనలు వివరించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న ఎస్సీల అభివృద్ధిని... సమాజంలోని ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించిన రోజే ఎస్సీల సాధికారత సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్న సీఎం... ఇవాళ నిర్వహించే సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

అయితే ఇవాళ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో జరగనున్న అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ బహిష్కరించింది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి దళితులపై మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించింది. ఎస్సీలు దూరమవుతున్నారని భావించి.. సమావేశం నిర్వహిస్తున్నారు తప్పా... వారిపై ప్రేమ లేదని ఆరోపించారు. అందువల్లే సమావేశానికి హాజరుకాబోమని స్పష్టంచేశారు.

Full View


Tags:    

Similar News