కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి తీవ్ర కలకలం రేపింది. 20 రోజుల క్రితం విగ్నేష్ అనే యువకుడిని పొట్టనపెట్టుకున్న పెద్దపులి ఇవాళ మరో యువతిపై దాడి చేసి చంపేసింది. నెలరోజుల వ్యవధిలోనే ఇద్దరిపై పెద్దపులి దాడి చేయడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. పెంచి కల్ పేట్ మండలంలోని కొండపల్లి గ్రామానికి చెందిన నిర్మల అనే యువతిపై పులి దాడి చేసింది. పత్తి పొలంలో పనికి వెళ్లిన నిర్మలపై వెనుకనుంచి పులి దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
రెండు రోజుల క్రితం కుమ్రుంభీం జిల్లా పెంచికల్‌పేట్ మండలం పెద్దవాగు పరివాహక ప్రాంతంలో పెద్ద పులి సంచరించడం స్థానికులు గుర్తించారు. పెద్దవాగు దగ్గర నదిలో నీళ్లు తాగుతుండగా రైతులు, గ్రామస్తులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. పెద్దపులి సంచారంపై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే అటవీశాఖ అధికారులకు మాత్రం ఇప్పటి వరకు పులిజాడ కనిపించలేదు.
మరోవైపు మనిషి రక్తం మరిగిన పులి స్థానికులను హడలెత్తిస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా 20 రోజుల క్రితం యువకుడిపై దాడి చేసి హతమార్చడంతో పులిని బంధించేందుకు అటవీశాఖ అలెర్ట్ అయింది. విగ్నేష్ పై దాడి జరిగిన వెంటనే అధికారులు పులిని పట్టుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పులిని పట్టుకునేందుకు 12 బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నెల 12న దిగిడ అడవి, పెద్దవాగు సమీపంలో రెండు బోన్లు ఏర్పాటు చేశారు. ఆ బోన్లలో లేగ దూడలను ఎరగా వేసి పరిశీలించారు. అయినప్పటికీ పులి జాడను కనుక్కోవడంలో అధికారులు విఫలమయ్యారు. ఇలాంటి తరుణంలో మరోసారి యువతిపై పులి దాడి చేసి హతమార్చడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. పెద్దపులి దాడితో పెంచికల్‌పేట్ మండలం పరిసర గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూనే గడుపుతున్నారు.