Heavy Rains: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
Heavy Rains: నేడు పలు చోట్ల భారీ వానలు * పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఇవాళ కూడా కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పాటు రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం గాంగెటిక్ పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఉండి, సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల వరుకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, తర్నాక, ఉప్పల్, హబ్సిగూడ, రామంతపూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, విద్యానగర్ లో వర్షం దంచికొట్టింది. అంబర్‌పేట్, రాంనగర్, దోమలగూడ, అల్వాల్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కుండపోత వానకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల మోకాలి లోతు నీళ్లు చేరాయి. బహదూర్‌పుర, రామ్నాస్‌పుర మధ్య నాలా ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు ఆగిపోయాయి. బహదూర్‌పురాలో వరదలో చిక్కుకున్న జనాన్ని స్థానిక యువకులు తాళ్లు, బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షపు నీటికి కొన్ని ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.
రాష్ట్రంలో మెదక్ జిల్లా చిట్కు్ల్‌లో అత్యధికంగా 14.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం అలియాబాద్‌లో 12.10 సెంటిమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో 10.03 సెంటిమీటర్లు, పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లిలో 9.08 సెంటిమీటర్ల వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒకటీరెండు గంగల వ్యవధిలోనే భారీ వర్షాలు కురిశాయి. ఇక ఇవాళ కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.