Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో నిందితులకు రిమాండ్
*14రోజులు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు.. ముగ్గురిని చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో నిందితులైన ముగ్గురికి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్ట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. అయితే రిమాండ్ ఆపాలని నిందితుల తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. అయితే న్యాయవాది అభ్యర్ధనను తోసిపుచ్చింది ఏసీబీ కోర్ట్. నిందితులు నందకుమార్, సింహయాజులు, రామచంద్రభారతిలను రిమాండ్‌కు అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే పోలీసులు.. షేక్‌పేట్‌లోని హిల్ టాప్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టు ఆదేశాల మేరకు సైబరాబాద్ సీపీ కార్యాలయానికి తరలించారు. తర్వాత అక్కడి నుంచి మొయినాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి.. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు ముగ్గురు నిందితులను ఏసీబీ కోర్టుకు తరలించారు. నిందితుల తరలింపుకు సంబంధించి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.