Lok Sabha Elections : ఈ అభ్యర్థులు తమ ఓటు తాము వేసుకోలేరు
Lok Sabha Elections : ఎన్నికల సమయంలో కొన్ని ఆసక్తికరమైన ఘటనలు సంభవిస్తుంటాయి. టాప్ లీడర్లు, పాపులర్ లీడర్లు అనుకున్నవారు.. తమ ఓటును తమ కోసం వేసుకోలేకపోతున్నారు.
Lok Sabha Elections : ఎన్నికల సమయంలో కొన్ని ఆసక్తికరమైన ఘటనలు సంభవిస్తుంటాయి. టాప్ లీడర్లు, పాపులర్ లీడర్లు అనుకున్నవారు.. తమ ఓటును తమ కోసం వేసుకోలేకపోతున్నారు. వారు నియోజకవర్గంలో ఎంత హై-పిచ్ లో ప్రచారం చేసినా.. ఎంత బలమైన క్రౌడ్-పుల్లర్లుగా పేరు తెచ్చుకున్నా.. వారి ఓటు మాత్రం వేసుకోలేకపోవడం కాస్త విచిత్రమే.
హైదరాబాద్ లో టాప్ లీడర్, జాతీయ స్థాయిలో పాపులర్ లీడర్లలో ఒకరిగా పేరున్న అసదుద్దీన్ ఒవైసీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడేం కొత్తకాదు. చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. అసదుద్దీన్ నివాసం రాజేంద్రనగర్ పరిధిలో ఉంది. ఈ ప్రాంతం చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గంలోకి వస్తుంది. ఆయన పోటీ చేస్తున్నదేమో హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి. కాబట్టి ఆయన ఓటును మరొకరికి త్యాగం చేయాల్సి వస్తోంది. చేవెళ్లలో ఎంఐఎం అభ్యర్థి నిలబడటం లేదు. కాబట్టి ఆయన ఇతర పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందే.
ఇక రావడం రావడమే.. దేశవ్యాప్తంగా పాపులరారిటీ సంపాదించుకున్న మరో హైదరాబాదీ లీడర్ కొంపెల్ల మాధవీలత. ఆమె హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ అసదుద్దీన్ కు కొరకరాని కొయ్యగా మారారు. ఈమె కూడా సేమ్ టు సేమ్ అసద్ లాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. మాధవీలత నివాసం ఈస్ట్ మారేడ్‌పల్లిలోని మహేంద్రహిల్స్‌లో ఉంది. ఆమె పేరు కంటోన్మెంట్ అసెంబ్లీ ఓటరు లిస్టులో ఉంది. అది మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దీంతో మాధవీలత తన ఓటు తాను వేసుకోలేకపోతున్నారు. మల్కాజ్ గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.
ఇక హైదరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా మహ్మద్ సమీర్‌కు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజవర్గం పరిధిలో ఓటు ఉంది. ఈ సెగ్మెంట్ సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. దీంతో ఈయన సైతం తన ఓటును తనకు వేసుకోలేకపోతున్నారు. సికింద్రాబాద్ లో బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మరోవైపు చేవేళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు ఉంది. ఇది మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గంలోకి రావడంతో తన ఓటును వేరే వారికి వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతా మహేందర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమె ఓటు తాండూరు అసెంబ్లీ పరిధిలో ఉంది. తాండూరు చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో సునీత కూడా తన ఓటు తాను వేసుకోకుండా ఇతరులకు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఆసక్తికరమైన స్థానాల్లోంచి పోటీ చేస్తున్నవారు కొందరైతే.. పవర్ ఫుల్ పొలిటికల్ ఫిగర్స్ గా ఉన్నవారు మరికొందరు. అలాంటివారు తమ ఓటు తాము వేసుకోలేకపోవడం ఆసక్తికరమే గాక.. ఒకవేళ... ఎవరైనా అలాంటి అభ్యర్థి ఒకే ఒక్క ఓటుతో ఓడిపోతే గనక ఇలాంటి అంశం పతాకశీర్షికల్లోకి ఎక్కడం ఖాయం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.