మునుగోడు అభ్యర్థి ప్రకటనపై డైలామాలో కాంగ్రెస్
Congress: ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ఢిల్లీకి పంపించిన టీపీసీసీ
Congress: మునుగోడు ఉప ఎన్నికకు.. అభ్యర్థిపై కాంగ్రెస్ ఎటూ తేల్చలేకపోతోంది. నెలాఖరుకు ప్రకటిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆశావహుల్లో ఎవరికి టికెట్ దక్కుతుందో తెలియక.. వారు క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు పని చేయడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. దీంతో పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డారు.
ఇటీవల ఢిల్లీలో ప్రియాంకగాంధీతో జరిగిన సమావేశంలో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిపై చర్చ జరిగింది. ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చిన ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్....అభ్యర్థి ఎంపికపై ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్లతో సమావేశమయ్యారు. మరుసటి రోజు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత దామోదర్‌రెడ్డిలు నలుగురు ఆశావహులతో సమావేశమయ్యారు. టికెట్ కేటాయింపు పారదర్శకంగా ఉంటుందని.. ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని తేల్చి చెప్పారు. ఎవరికి టికెట్ వచ్చినా అందరు కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని స్పష్టం చేశారు. స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయం కూడా జోడించి.. అభ్యర్థి ఎంపికకు చెందిన వివరాలను ఏఐసీసీకి పంపినట్లు తెలుస్తోంది.
పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్నేతలు ఆశావహుల్లో ఉండగా.. వీరిందరి బలాబలాలపై క్షేత్రస్థాయిలో కాంగ్రెస్రాజకీయ వ్యూహకర్త సునీల్కనుగోలు బృందం సర్వేలు నిర్వహించింది. ఆ నివేదికలతో పాటు.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్‌నేతలు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఏఐసీసీకి నివేదిక పంపినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులతో సమావేశాలు ఏర్పాటు చేసి... భరోసా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో క్యాడర్ కొంత అయోమయంలో పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.