TGSRTC Special Buses: శివ భక్తులకు గుడ్ న్యూస్.. కార్తిక మాసంలో ఆ పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులు
TGSRTC Special Buses For Lord Shiva Devotees: కార్తిక మాసంలో శివ భక్తులు శైవ క్షేత్రాలను సందర్శిస్తుండటాన్ని దృష్టిలో పెట్టుకుని వారి కోసం తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని శ్రీశైలం, వేములవాడ రాజన్న, ధర్మపురి, కీసరగుట్ట దేవాలయాలకు హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సు సేవలు అందించనున్నట్లు టిజిఎస్ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ తెలిపారు. అలాగే ఏపీలోని పంచారామ క్షేత్రాలకు కూడా ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ నెల 15న కార్తిక పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలం వెళ్లే భక్తులను కూడా దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుండి అరుణాచలం స్పెషల్ బస్ సర్వీస్ ఏర్పాటు చేస్తున్నట్లు సజ్జనార్ ప్రకటించారు.
ప్రస్తుతం ఆర్టీసీ పని తీరు ఎలా ఉంది, కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలు సందర్శించే భక్తుల రద్దీ, శబరిమల అయ్యప్ప భక్తుల తాకిడి, మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకం, తదితర అంశాలపై హైదరాబాద్ బస్ భవన్‌లో శనివారం వర్చ్‌వల్‌గా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ ఎక్స్ వేదికగా మీడియాకు వెల్లడిస్తూ ఈ వివరాలు తెలిపారు.
ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ బుక్ చేసుకోవాలనుకునే వారు http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవడం ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం 040-69440000, 040-23450033 నెంబర్లపై ఆర్టీసీ కాల్ సెంటర్‌ని సంప్రదించాల్సిందిగా సూచించారు.