TGSRTC DASARA Special: పండక్కి తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్..ప్రయాణికుల సేవలపై కీలక ప్రకటన
TGSRTC DASARA Special: తెలంగాణలోని ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. దసరా, బతుకమ్మ పండగలకు ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సేవలపై కీలక ప్రకటన చేసింది.
TGSRTC DASARA Special: పండగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత సులభంగా రవాణాను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి దసరాకు ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. స్వగ్రామాలకు వెళ్లేవారికోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోషన్ నగర్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. కొత్త ఔఆర్ఆర్ నుంచి బస్సును నడుపుతుండటం విశేషం.
అటు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కోసం గచ్చిబౌలి, ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరు వంటి ప్రాంతాలకు బస్సులు నడిపేలా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. దసరా పండగక్కి ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై తమ క్షేత్ర స్థాయి అధికారులతో సోమవారం ఎండీ వీసీ సజ్జనార్ సమావేశం అయ్యారు. ఈ మేరకు కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. గతంలో మాదిరిగా ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రద్దీని బట్టి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ ఎండీ సూచించారు.
దసరా, బతుకమ్మ పండగల వేళ ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తుకుండా ఉండేందుకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండి తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఈ స్పెషల్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో ముందుస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతోపాటు ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆర్టీసీ ఎండి తెలిపారు.
ఇక అక్టోబర్ 12న దసరా పండుగా ఉంది. 9, 10, 11 తేదీల్లో ప్రయాణికులు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోజుల్లో ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ రెడీ అయ్యింది. పండగ సయమంలో ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజా దగ్గర ప్రత్యేక లేన్లను కేటాయించేలా చర్యలు తీసుకోనుంది ఆర్టీసీ.