మునుగోడు ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతున్న చిన్న పార్టీలు
Munugode: ప్రచారంలో దూసుకుపోతున్న చిన్న పార్టీలు.. టీఆర్ఎస్, బీజేపీలకు బీఎస్పీ, టీజేఎస్ టెన్షన్
Munugode: మునుగోడు ఎన్నిక ప్రచారం ముమ్మరమైంది. ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలతోపాటు పలు చిన్న పార్టీలు బరిలోకి దిగడం, ప్రచారాన్నీ సీరియస్‌గానే నిర్వహిస్తుండడంతో మునుగోడులో సాధారణ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. చిన్న పార్టీలకు తోడు స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యలో బరిలో నిలవడం ప్రధాన పార్టీలకు ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
చిన్న పార్టీలు, స్వతంత్రులు సాధించే ఓట్లు ఎన్ని? ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎవరి ఓట్లను అవి చీల్చనున్నాయి? అది ఎవరి అవకాశాలను దెబ్బ తీస్తుందోనని నేతల్లో టెన్షన్ మొదలైంది. ఈ చిన్న పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలో సాధించే ఓట్లు, ఫలితంపై చూపించే ప్రభావాన్ని బట్టి వచ్చే శాసనసభ సాధారణ ఎన్నికల్లో వాటి ప్రాధాన్యం ఎంత అన్నది కూడా తేలిపోనుంది.
వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి అన్ని ఎన్నికల్లోనూ చిన్న పార్టీల ప్రభావం పెద్దగా లేదు. ఇటీవలి కాలంలో పలు పార్టీలు కొంత యాక్టివ్ అయ్యాయి. చిన్న పార్టీలతో పాటు పెద్దసంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు మునుగోడు బరిలో ఉన్నారు. వీరికి కేటాయించిన గుర్తులు కారు, కమలం గుర్తులను పోలి ఉండటంతో.. తమకు ఎక్కడ నష్టం జరుగుతుందోనని టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మునుగోడులో ముక్కోణపు పోటీ జరుగుతుందని అందరూ భావిస్తున్నా.. చిన్న పార్టీలు సైతం ప్రచారంలో దూసుకెళ్తూ ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతున్నాయి.
బీఎస్పీ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్... మునుగోడు బీసీ అభ్యర్థిగా శంకరాచారిని బరిలో దించారు. ఈ వర్గం ఓటర్లతో పాటు దళిత, బహుజన ఓటర్ల మద్దతు తమకే ఉంటుందని బీఎస్పీ ధీమా వ్యక్తం చేసింది. దీంతో బీఎస్పీతో తమకు నష్టం జరిగే అవకాశం ఉందని ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్ కూడా మునుగోడులో అభ్యర్థిని బరిలోకి దించింది. చండూరు మండలం బోడంగిపర్తికి చెందిన పల్లె వినయ్‌కుమార్ ఈ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. టీజేఎస్‌తో కూడా ఓట్లు చీలే అవకాశం ఉందని ప్రధాన పార్టీల నేతలు మదన పడుతున్నారు.