యావత్ తెలంగాణ ఏకమైన రోజు.. కేసీఆర్ 'దీక్షా దివస్'కు నేటితో పదేళ్లు పూర్తి!

Update: 2019-11-29 05:20 GMT
కేసీఆర్

తెలంగాణ మలిదశ ఉద్యమానికి ప్రాణం పోసిన రోజు అప్పటివరకు సాగిన పోరాటం మలుపు తీసుకున్న రోజు నవంబర్ 29. ప్రత్యేక తెలంగాణే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎక్కుపెట్టిన అస్త్రం ఆమరణ దీక్ష. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున కేసీఆర్‌ దీక్ష చేపట్టారు. పదేళ్ల దీక్షా దివస్ సందర్భంగా హెచ్‌ఎంటీవీ ప్రత్యేక కథనం.

సరిగ్గా పదేళ్ల క్రితం తెలంగాణ మలిదశ ఉద్యమం మలుపు తిప్పిన రోజు నవంబర్ 29. ఆనాడు సిద్ధిపేట శివారులో దీక్షకు దిగేందుకు సిద్ధమయ్యారు అప్పటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్‌. అప్పటికే నిరసనలతో తెలంగాణ పల్లెలు అట్టుడుకుతున్న సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఆమరణ నిరహార దీక్షే శరణ్యమని కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్‌ సచ్చుడో అనే నినాదంతో కదిలాడు. కేసీఆర్‌ దీక్షకు ప్రజా సంఘాలు, విద్యార్థీ యూనియన్లు, కార్మికులు, కర్షకులు యావత్ తెలంగాణ సమాజం మద్దతు పలికింది.

దీక్ష రోజున రాష్ట్రం నలమూలల నుంచి వేలాది సంఖ్యలో జనం కరీంనగర్‌కు తరలివచ్చారు. ప్రాంతీయ, జాతీయ మీడియా ప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర బలగాలతో కరీంనగర్‌ నివురుగప్పిన నిప్పులా మారింది. పోలీసులు కేసీఆర్‌ను అరెస్ట్‌ చేస్తారన్న ప్రచారం రావడంతో స్వయంగా కేసీఆర్‌ కల్పించుకున్నారు. బలగాలను వెంటనే వెనక్కి పంపించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష ఆగదని స్పష్టం చేశారు.

3 రోజుల పాటు కరీంగనర్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉద్రిక్త పరిస్థితులు అందరిలో ఉత్కంఠను రేపాయి. ఇక ఆరోజు రానే వచ్చింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గులాబీ దళం మధ్య కేసీఆర్‌ సిద్ధిపేటలోని దీక్షా శిబిరానికి కదిలారు. తన ఇంటి నుంచి కాన్వాయ్‌ స్టార్ట్ అవగానే కరీంనగర్ శివారు అలుగునూర్ కూడలిలో పోలీసులు కేసియార్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. ఆయన్ని అరెస్ట్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయినా వెనక్కి తగ్గని పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కేసీఆర్‌ను మరో వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో ఉన్నా కేసీఆర్‌ దీక్ష కొనసాగించారు. దీంతో తెలంగాణ పల్లెల్లో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అంతా ఏకమై నిరసనలతో హోరెత్తించారు. యూనివర్శిటీల్లో విద్యార్థులు గర్జించారు. దీంతో దిగొచ్చిన కేంద్రం డిసెంబర్‌ 9 న ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని అప్పటి కేంద్రమంత్రి చిదంబరం ప్రకటించారు.

ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలతో.. కేంద్రం వెనక్కి తగ్గింది. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి కేసీఆర్‌ నిర్వహించిన దీక్షే ప్రధానకారణంగా చెబుతారు. మలిదశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన దీక్షను ఉద్యమకారులు ఇవాళ స్మరించుకుంటున్నారు. ఏటా నవంబర్ 29 న దీక్షా దివస్‌గా జరుపుకుంటున్నారు.  

Tags:    

Similar News