Telangana - AP: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా... కమ్మేస్తోన్న పొగమంచు

Telangana - AP: ఎముకలు కొరికే చలితో గజగజ వణికిపోతున్న ప్రజలు.. రాత్రి పూట పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Update: 2021-11-06 02:50 GMT

Telangana - AP: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా... కమ్మేస్తోన్న పొగమంచు

Telangana - AP: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. చలి కాలం పూర్తిగా రాకముందే.. పలు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు ఆవహిస్తోంది. తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటలు అయినప్పటికీ మంచు తేరుకోవడం లేదు. దీంతో.. మంచు తెరల మధ్య సూర్యుడు.. పున్నమి చంద్రుడులా దర్శనమిస్తున్నాడు.

మరోవైపు.. పొగ మంచు కారణంగా ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. నాలుగైదు అడుగుల దూరంలో ఉన్న మనిషి కూడా కన్పించని పరిస్థితి నెలకొంటోంది.

తెల్లవారుజాము నుంచే భారీగా మంచు కురుస్తోంది. దీంతో.. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. పొగ మంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రయాణాలు చేయాలంటేనే వెనకాడుతున్నారు.

ఏజెన్సీలోనూ ఉష్ణోగ్రతలు వీపరీతంగా పడిపోయాయి. దాంతో చలికి ఏజెన్సీ మండలాల ప్రజలు అల్లాడుతున్నారు. దీనికి తోడు పలు గ్రామాలను పొగ మంచు కమ్మేస్తుండటంతో బయటకు రావడానికి సాహసించడం లేదు.

విశాఖ ఏజెన్సీ అరకు వ్యాలీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. పాడేరు, మినుములూరు, లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు.. తెలంగాణలోనూ అదే పరిస్థితి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా, సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పతాక స్థాయికి పడిపోతున్నాయి.

ఏజెన్సీ ప్రాంతాలైన అర్లి(టి), గిన్నెధర, కోహీర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ చలి పంజా విసురుతోంది. రాత్రితోపాటు పగలు ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికంటే తక్కువకు పడిపోతున్నాయి. పగలు కూడా చలి వణికిస్తోంది.

Tags:    

Similar News