తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆయుష్మాన్ భారత్‌తో ఆరోగ్యశ్రీ అనుసంధానం
ఆరోగ్యశ్రీ పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్‌తో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని మోదీ నిర్వహించిన ప్రగతి సమీక్షలో సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు ప్రధానికి సీఎస్ వివరించారు.
2018లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకంలో ప్రతీ కుటుంబానికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల వరకు వైద్యం అందించేలా నిర్ణయించింది. దేశంలో 50 కోట్ల మందికి 1393 రకాలైన వ్యాధులకు చికిత్స పొందేందుకు అవకాశం కల్పించింది. ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ స్వాగతించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్త పేదలకు అత్యాధునిక వైద్యసదుపాయం అందుతుందని గవర్నర్ పేర్కొన్నారు.