TG TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. టెట్, డీఎస్సీ దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్..
TG TET 2024 Results: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET 2024) ఫలితాలు నేడు విడుదలయ్యాయి.
TG TET 2024 Results: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET 2024) ఫలితాలు నేడు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా బుధవారం మధ్యాహ్నం టెట్-2024 ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరు కాగా 57,725 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. పేపర్-2కు 1,50,491 మంది హాజరయ్యారని, వారిలో 51,443 అభ్యర్థులు అర్హత సాధించారని అధికారులు తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ఈ సందర్భంగా అభ్యర్థులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్-2024లో అర్హత సాధించని వారికి వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించింది. అదేవిధంగా ఇప్పుడు అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఎన్నికల కోడ్ వల్ల టెట్-2024 దరఖాస్తు ఫీజులను ప్రభుత్వం తగ్గించలేకపోయింది. దీంతో తదుపరి టెట్, డీఎస్సీ దరఖాస్తుదారులకు ఉపశమనం కలిగించింది.
కాగా తెలంగాణ టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. ఈ టెట్ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హులవుతారు. పేపర్-2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హతలవుతారు. తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాల కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. జూలై మాసంలో ఇందుకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి.