తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్ ఫిర్యాదులు చూసి బిత్తరపోయిన ఉన్నతాధికారులు
Telangana Residential school students in Warangal: రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివే పిల్లలకు అన్నిరకాల సదుపాయాలు అందించడం ప్రభుత్వం బాధ్యత. సంబంధిత అధికారులు ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తున్నారా లేదా అనేది అప్పుడప్పుడు తనిఖీలు చేయడం ఆ పై ఉన్నతాధికారుల బాధ్యత. అందులో భాగంగానే వరంగల్ జిల్లా కలెక్టరేట్ అధికారులు ఇటీవల జిల్లాలోని ఒక రెసిడెన్షియల్ స్కూల్ విజిట్ చేశారు. స్కూల్ ని తనిఖీ చేసిన అనంతరం మీకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే వాటిని ఒక చిట్టీ మీద రాసి ఈ కంప్లైంట్స్ బాక్సులో వేయండి అని పిల్లల కోసం కంప్లైంట్స్ బాక్సులు ఏర్పాటు చేశారు.
సాధారణంగా రెసిడెన్షియల్ స్కూల్ అనేటప్పటికీ ఎవరైనా ఏం ఊహిస్తారు? తమకు వార్డెన్ నాణ్యమైన ఆహారం అందివ్వడం లేదనో లేక స్కూల్లో ఏదైనా సబ్జెక్టులకు టీచర్స్ లేరు అనో ఫిర్యాదులు వస్తుంటాయి. లేదంటే కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం ఇవ్వమని, ప్లే గ్రౌండ్, స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ ఇవ్వాల్సిందిగా పిల్లలు రిక్వెస్ట్ చేయడం కనిపిస్తుంటుంది. వరంగల్ కలెక్టరేట్ అధికారులు కూడా ఇంచుమించు ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయని ఆశించారు. కానీ కొద్దిరోజుల తరువాత కంప్లైంట్స్ బాక్స్ ఓపెన్ చేసి చూసి షాక్ అవడం అధికారుల వంతయ్యింది.
ఇంతకీ ఆ కంప్లైంట్స్ బాక్సుల్లో ఏముంది? అధికారులు బిత్తరపోయేంతగా పిల్లలు ఏం కంప్లైంట్స్ రాసి పెట్టారో తెలిస్తే ఎవరికైనా నవ్వాలో లేక ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది.
వరంగల్ కలెక్టర్ అధికారులు కంప్లైంట్ బాక్సులు ఓపెన్ చేసి చూస్తే వాటి నిండా ఫిర్యాదుల చిట్టీలు కనిపించాయి. అవి చదవడం మొదలుపెట్టిన అధికారులకు ఫ్యూజులు ఎగిరిపోయినంత పనైంది. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నతంగా ఆలోచించి తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు. తమకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిందిగా అధికారులకు విన్నవించుకున్నారు. ఇంకొంతమంది మాత్రం ఇంత సీరియస్ విషయంలోనూ ఆకతాయి వేషాలు వేశారు. స్కూల్లో తమకు అందరికీ చిన్నగా హెయిర్ కట్ చేస్తూ తమ గ్లామర్ పై దెబ్బ కొడుతున్నారని అబ్బాయిలు ఫిర్యాదు చేశారు. తమ ఫేవరైట్ హీరో ప్రభాస్. ప్రభాస్ తరహాలో హెయిర్ స్టైల్ పెంచుకోవాలనేది తమ కోరిక. కానీ స్కూల్ సిబ్బంది మాత్రం అందరికీ ఒకే స్టైల్లో హెయిర్ కట్ చేసి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ లేకుండా చేస్తున్నారనేది ఆ పిల్లల కంప్లైంట్.
ఇదిలావుంటే మగ పిల్లల కంప్లైంట్స్ ఇలా ఉన్నాయంటే అమ్మాయిల కంప్లైంట్స్ ఇంకో రకంగా ఉన్నాయి. తమ జుట్టును ఫ్రీగా వదిలెయ్యనివ్వడం లేదని, చేతులకు నచ్చిన ఫ్యాషన్ గాజులు పెట్టుకోనివ్వడం లేదని అమ్మాయిలు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్స్ బాక్సును ఈ విధంగా వాడుకున్న తీరు చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకున్నారు.
బహుషా ఇది పిల్లల్లో ఎవరో ఒకరు కావాలని చేసిన ప్రాంక్ అయ్యుంటుందని భావించారు. ఇదే విషయమై వారితో మాట్లాడారు. అప్పుడే తెలిసింది అది ప్రాంక్ కోసం రాసినవి కాదు.. నిజంగానే ఫ్యాషన్ పట్ల వారికి ఉన్న క్రేజ్ అని. చిన్నతనంలోనే పిల్లలు ఫ్యాషన్ పరంగా తమ ఉనికిని చాటుకునేందుకు గట్టిగా తహతహలాడుతున్నారని అధికారులకు అర్థమైంది.
పిల్లల ఆలోచన తీరుపై సోషల్ మీడియా, సినిమాల ప్రభావం గట్టిగానే ఉందనడానికి ఇదొక నిదర్శనం. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు.. స్కూల్ పిల్లల మానసిక వికాసం కోసం పనిచేసే ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న మాట.