వర్షాకాలంలో వానలు పడటం కామన్. కానీ సీజన్ అయిపోయాక కూడ వర్షాలు కురుస్తుడటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. అంతేకాదు కురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం నమోదవుతుంది.
ఈ ఏడాది వానలు దంచికొడుతున్నాయి. దీంతో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. లెక్కప్రకారం నైరుతి రుతుపనాల సీజన్‌లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 720మిల్లీమీటర్లు నమోదవుతుంది. కానీ ఏకంగా ఈసారి 1078మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఇక ఈ ఏడాది 50శాతం అధిక వర్షపాతం నమోదనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు
నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసిన తర్వాత ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ కాలంలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అక్టోబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 77మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ప్రస్తుతం 153మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా హైదరాబాద్‌లో ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో 323మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తెలంగాణలోని అన్నీ జిల్లాల్లో సాధారణం కంటే అధికవర్షపాతం నమోదైంది. కానీ ఆదిలాబాద్, నిజామాబాద్‌లో మాత్రం సాధరణ వర్షపాతం కూడా నమోదుకాలేదు. ఇప్పటివరకు కురివాల్సిన వర్షానికన్నా జిల్లాలో 15శాతం తక్కువ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.