కరోనాపై తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్.. రాష్ట్రవ్యాప్తంగా 144వ సెక్షన్ విధించే యోచన
కరోనాపై తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ అయింది. అన్నీ నగరాల కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో డీజీపీ మహేందర్ రెడ్డి సమావేశమయ్యారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జనం గుంపులు గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకోనున్నారు. విదేశాల నుంచి వచ్చేవారిపై పోలీసుల ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 144వ సెక్షన్ విధించే యోచనలో ప్రభుత్వం ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై చర్చిస్తున్నారు. మొన్నటి వరకు రాజధాని హైదరాబాద్‌కే పరిమితమైన కరోనా.. ప్రస్తుతం జిల్లాలకు కూడా పాకడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు..? ఏదైనా కీలకమైన ప్రకటన చేస్తారా..? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక నగరాలు, పట్టణాల్లో నిషేధాజ్ఞలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.