దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో తెలంగాణ ఒకటని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) పాలసీని ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్‌లో ఆవిష్కరించారు. ఈ పాలసీ విధానాన్ని ప్రకటించారు.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో సగటు వార్షిక జీఎస్డీపీ 14.2 శాతం ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో ప్రభుత్వం 178 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. టీఎస్‌ఆర్‌టీసీ కూడా 40 ఎలక్ట్రిక్ బస్సులను వాడుకలోకి తెచ్చిందని అన్నారు. సుస్థిర, పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల్లో తాము కూడా ఉన్నామని చెప్పారు.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే దిశలో..
కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా నూతన ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) రూపొందించారు. 2020-2030 వరకు తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగానికి సంబంధించి ఈ పాలసీని రూపొందించారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఈ నూతన విధానాన్ని ప్రకటించారు.
ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికిల్స్ విషయంలో పలు రాయతీలు ప్రకటించింది. అవి ఏమిటంటే..
- రాష్ట్రంలోనే కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి పలు రాయితీలను ఇస్తారు.
- ఇందులో భాగంగా తొలి 2 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 20వేల ఆటోలు, మొదటి 5వేల 4 చక్రాల వాహనాలు, మొదటి 10వేల లైట్ గూడ్స్ వాహనాలు, 500 ఎలక్ట్రిక్ బస్సులకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ రుసుం మినహాయింపు ఇవ్వనున్నారు.
- ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ రుసుం పూర్తిగా తొలగించారు.
- ప్రజా రవాణా వ్యవస్థలోనూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం అందిస్తూ ఛార్జింగ్ అవసరాల కోసం అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్, మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్‌కుమార్ గోయెంకా, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్.. తదితరులు పాల్గొన్నారు.