Telangana: ఆక్సిజన్‌ సిలిండర్ల బ్లాక్‌ మార్కెట్‌ దందాపై పోలీసుల ఉక్కుపాదం

Telangana: కరోనా వైరస్‌ వణికిస్తుంది. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వైరస్‌తో జనజీవనం స్తంభించిపోయింది.

Update: 2021-05-08 10:06 GMT

Telangana: ఆక్సిజన్‌ సిలిండర్ల బ్లాక్‌ మార్కెట్‌ దందాపై పోలీసుల ఉక్కుపాదం

Telangana: కరోనా వైరస్‌ వణికిస్తుంది. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వైరస్‌తో జనజీవనం స్తంభించిపోయింది. దళారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. అడ్డదారుల్లో సంపాదించేందుకు బ్లాక్‌ మార్కెట్‌ దందాను మొదలు పెట్టారు. ప్రజల ప్రాణాలతో కరోనా చెలగాటమాడుతుంటే, ఇదే అదునుగా భావించిన కొందరు వారి ప్రాణాలను క్యాష్ చేసుకుంటున్నారు.

కరోనా వేళ.. కొందరు కేటుగాళ్లు కాసుల వేటలో పడ్డారు. రోగుల బలహీనతను ఆసరాగా చేసుకొని అందిన కాడికి దండుకుంటున్నారు. రాష్ట్రంలో అత్యవసర మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించేందుకు యత్నిస్తున్న కేటుగాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న వారని నియంత్రించాలని హోంమంత్రి మహమూద్‌అలీ ఆదేశాలిచ్చారు. దీంతో నకిలీ మందులు, నల్లబజార్‌ వ్యాపారాలను అడ్డుకోవడంపై క్షేత్రస్థాయిలో పోలీసులు మరింత దృష్టిపెట్టారు. ఇప్పటికే హైదరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పలువురిపై కేసులు నమోదుచేశారు.

ఇప్పటికే 39 కేసులు నమోదైనట్లు డీజీపీ మహేందర్‌ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. మెడికల్‌ ఫీల్డ్‌లో ఉన్నకొందరు ఓ ముఠాగా తయారైయ్యారని డీజీపీ తెలిపారు. అయితే బ్లాక్ దందా నిర్వహిస్తున్న వారు ఎంతటి వారైన వదిలిపెట్టకుండా కేసులు నమోదు చేయాలని హైకోర్టు పోలీస్ శాఖ కు ఆదేశాలు జారీచేసింది. బ్లాక్‌ రాయుళ్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే మూడు కమిషనరేట్‌ పరిధిలో పలు ముఠాలను అరెస్ట్ చేశారు పోలీసులు. అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు కరోనా మహమ్మారి ప్రైవేట్‌ ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. వైరస్‌ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్ దవాఖానాలు పనిచేస్తున్నాయి. కేసులు రోజురోజుకూ పెరగడంతో ఇదే అదునుగా ఫీజుల దోపీడికి తెరలేపాయి. ఇంత జరుగుతున్నా వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక కరోనా సామాన్యులకు శాపంగా మారితే ఉత్తుత్తి డాక్టర్లకు పెద్ద వరంగా మారింది. కరోనా సమయంలో ప్రతి వైద్యుడు దేవుడిగా మారి సేవలందిస్తుంటే కొందరు కంత్రిగాళ్లు మాత్రం వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. తెల్ల కోటు వేసుకొని నల్ల దందా చేస్తున్నారు.

Tags:    

Similar News