High Court Serious on Private Hospitals: ప్రైవేటు ఆస్పత్రులపై హైకోర్టు సీరియస్.. కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశం
High Court Serious on Private Hospitals: తెలంగాణాలో ఒక ప్రైవేటు ఆస్పత్రిపై చర్యలు తీసుకుని రెండు రోజులు గడవక ముందే మరో కొన్నింటిపై ఆరోపణలు వచ్చాయి.
High Court Serious on Private Hospitals: తెలంగాణాలో ఒక ప్రైవేటు ఆస్పత్రిపై చర్యలు తీసుకుని రెండు రోజులు గడవక ముందే మరో కొన్నింటిపై ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఏకంగా ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. రెండు రోజులు క్రితం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కరోనా చికిత్సకు అధికంగా చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ సర్కార్ ఎట్టకేలకు చర్యలకు దిగింది. హైదరాబాద్ సోమాజిగూడలోని డెక్కన్ హాస్పిటల్ కు ఇచ్చిన కరోనా ట్రీట్‌మెంట్ పర్మిషన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై కరో నా పేషెంట్లను అడ్మిట్ చేసుకోవద్దని ఆదేశించింది.
కరోనా చికిత్స పేరుతో అనేక మంది రోగుల నుంచి డెక్కన్ ఆస్పత్రి లక్షల రూపాయల కొద్ది బిల్లులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పదే పదే కరోనా రోగులను ఇబ్బంది పెట్టడం, ఇష్టారాజ్యంగా వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో సర్కార్ ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆస్పత్రిపై వస్తున్న ఆరోపణలు నిజమని రుజువు కావడంతో ప్రభుత్వం ఇలా షాక్ ఇచ్చింది. అయితే కేవలం కరోనా చికిత్సను మాత్రమే నిలిపివేస్తూ.. మిగిలిన చికిత్సలకు యధావిధిగా అనుమతి ఇచ్చారు. ఇది గడిచి రెండు రోజులు కాకముండే మరలా ప్రైవేటు ఆస్పత్రులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో మరోమారు వీటికి సంబంధించి చేస్తున్న ఆగడాలు తెరపైకి వచ్చాయి.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక చార్జీల వసూలుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోలో, బసవతారకం వంటి కార్పొరేట్ ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయంటూ ఓ రిటైర్డ్ ఉద్యోగి పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రవేట్ అస్పత్రుల వ్యవహారిస్తున్న తీరు పట్ల అసహానం వ్యక్తం చేసింది. కొందరు పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరతో భూములను కేటాయించిందన్న పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కానీ, అపోలో, బసవ తారకం ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం మరిచాయని పిటిషనర్ వాదించారు. ఈ క్రమంలో షరతులు ఉల్లంఘిస్తే భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అధిక బిల్లులు చెల్లించకపోతే మృతదేహం కూడా అప్పగించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని.. భూములు వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అపోలో, బసవ తారకం ఆస్పత్రులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.