HYDRAA: హైడ్రాపై హైకోర్టు సీరియస్: చార్మినార్ ను కూడా కూల్చేస్తారా?

Telangana High Court: హైకోర్టులో హైడ్రాపై విచారణ కొనసాగుతోంది.

Update: 2024-09-30 06:11 GMT

Telangana High Court: హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం పెద్దకిష్టారెడ్డిపేటలో కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారించింది.   ఈ విచారణకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, అమీన్ పూర్ తహాసీల్దార్ వర్చువల్ గా హాజరయ్యారు. ముఖ్యంగా శని, ఆదివారాలు, సాయంత్రం తర్వాత భవనాల కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. శని, ఆదివారాల్లో కూల్చివేయవద్దని గతంలో కోర్టులు తీర్పులున్నాయనే విషయాన్ని ఉన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. అధికారుల వివరణపై హైకోర్టు సంతృప్తి చెందలేదు.

చార్మినార్ ను కూల్చివేస్తారా?: రంగనాథ్ ను ప్రశ్నించిన హైకోర్టు

అమీన్ పూర్ లో కూల్చివేతలకు సంబంధించి అవసరమైన పరికరాలను తాము అందించామని హైకోర్టుకు హైడ్రా కమిషన్ ఏవీ రంగనాథ్ చెప్పారు. రేపు చార్మినార్ , హైకోర్టులను కూల్చాలని స్థానికంగా ఉన్న అధికారులు కోరితే కూల్చివేస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఖాళీ చేయనంత మాత్రమే అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముంది? రాజకీయ బాస్ లను సంతృప్తిపర్చేందుకు, పై అధికారులను మెప్పించేందుకు చట్ట విరుద్దంగా పనిచేయవద్దని హైకోర్టు సూచించింది.

 ఆదివారం నాడు కూల్చివేతల్లో మీ ఉద్దేశ్యం ఏమిలో చెప్పాలి. ఇస్టానుసారంగా వ్యవహరిస్తే 99 జీవోపై స్టే ఇస్తామని హైకోర్టు తెలిపింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధతను తెలిపాలని హైకోర్టు కోరింది. అక్రమ నిర్మాణాలు జరగకుండా చూడాలని కోర్టు కోరింది.

చర్లపల్లి, చంచల్ గూడ జైళ్లకు పంపితే అప్పుడు తెలుస్తుంది: హైకోర్టు

సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడం, స్థానిక సంస్థల అనుమతులతో సామాన్యులు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది. చట్టప్రకారంగా నడుచుకోకపోతే తహసీల్దార్లు ఇబ్బందులు పడాల్సి వస్తోందని తహసీల్దార్లను హైకోర్టు హెచ్చరించింది.

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం ఉంది. రికార్డులు పరిశీలించకుండానే గుడ్డిగా ఎలా కూల్చుతారని ప్రశ్నించింది.అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే  ఆపాలి. ఒకవేళ కడితే వాటిని సీజ్  చేయాలి. రాత్రికి రాత్రే మార్పు వస్తుందని హైడ్రా ఎలా భావిస్తుంది. ఆదివారం కూల్చివేత్తలు వద్దని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఉన్న విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. నిబంధనలు ఉల్లంఘించే అధికారులను చంచల్ గూడ, చర్లపల్లి జైలుకు పంపితే అప్పుడు తెలుస్తుందని హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది.

ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా అని హైకోర్టు ప్రశ్నించింది.చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. కానీ, అలా ఎందుకు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. హైడ్రా ఏర్పాటు అభినందనీయం... కానీ, పనితీరే అభ్యంతరకరమని హైకోర్టు తెలిపింది.

యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశం

అమీన్ పూర్ కూల్చివేతలపై యథాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. అమీన్ పూర్ తహసీల్దార్, హైడ్రా కమిషనర్ కమిషనర్ తీరు సంతృప్తికరంగా లేదు. నగరంలోని పలు చెరువుల ఎఫ్ టీ ఎల్ లు నిర్ధారించకుండానే అక్రమ నిర్మాణాలు అని ఎలా నిర్ధారిస్తారు. ఈ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది హైకోర్టు. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని అమీన్ పూర్ తహసీల్దార్, హైడ్రా కమిషనర్ ను ఆదేశించింది కోర్టు.

Tags:    

Similar News