పొలిసు శాఖలో నాన్ కేడర్ పోస్టులకు తుది కేటాయింపులు చేపట్టాలని కేంద్రానికి తెలంగాణా హైకోర్టు ఆదేశం
Telangana High Court: తెలుగు రాష్ట్రాలు విభజన జరిగి ఏడెనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికే కేంద్రానికి సంబంధించిన కొన్ని కేటాయింపులు పూర్తికాలేదు.
Telangana High Court: తెలుగు రాష్ట్రాలు విభజన జరిగి ఏడెనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికే కేంద్రానికి సంబంధించిన కొన్ని కేటాయింపులు పూర్తికాలేదు. దీనివల్ల పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నా కేంద్రం అలసత్వం వీడలేదు. ఈ స్థితిలో కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో తుది కేటాయింపులు చేయడంపై కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీచేసింది.
తాజాగా ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చని సూచించింది. ఉన్నతాధికారుల పునర్విభజన సలహా కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని, పునర్విభజన చట్టం నిబంధనల మేరకు కేటాయింపులు చేసి తెలంగాణ, ఏపీ హోం శాఖ, డీజీపీలకు తెలియజేయాలని తీర్పునిచ్చింది. ఈ ప్రక్రియను ఆరు వారాల్లో పూర్తి చేయాలని, ఇందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతోపాటు డీజీపీలు సహకరించాలని స్పష్టం చేసింది. తనను ఏపీకి కేటాయించకపోవడాన్ని సవాల్ చేస్తూ కర్నూల్ జిల్లాకు చెందిన డీఎస్పీ జి.నాగన్న దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఇది ఒక్కరికి చెందింది కాదు....
తనను ఏపీకి కేటాయించాలంటూ నాగన్న పిటిషన్ దాఖలు చేసినా.. ఇరు రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు తమ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. తుది కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వ వాదన ఏంటో చెప్పాలంటూ పలు పర్యాయాలు గడువు ఇచ్చినా వాదనలు వినిపించకపోవడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. అలాగే ఆరువారాలు గడువు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం తయారు చేసిన సీనియారిటీ జాబితాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందంటూ కేంద్రం మౌనంగా ఉంటే ఎలా అని ప్రశ్నించింది. తెలంగాణ అభ్యంతరాలను పరిష్కరించే పరిధి కేంద్రానికి ఉన్నా పట్టనట్లుగా వ్యవహరించిందని పేర్కొంది.
నాగన్నను విధుల్లోకి తీసుకోవాలి....
తాత్కాలిక కేటాయింపుల్లో భాగంగా తెలంగాణకు కేటాయించిన డీఎస్పీ జి.నాగన్నను తుది కేటాయింపుల్లో కేంద్రం ఏపీకి కేటాయిస్తే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కేటాయింపుల్లో జాప్యంతో పదోన్నతులు, ఇతర అలవెన్స్‌లు, పదవీ విరమణ బెనిఫిట్స్ మీద దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో కేటాయింపుల్లో జాప్యానికి కారణమైన కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు రూ.5 వేల చొప్పున నాగన్నకు పరిహారంగా చెల్లించాలని స్పష్టం చేసింది.