Telangana: బ్లాక్ ఫంగస్‌పై కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
Telangana: ఒకవైపు కరోనాతో దేశమంతా అల్లాడిపోతుంటే... దానికి బ్లాక్ ఫంగస్ కూడా తోడై కోవిడ్ బాధితులను వెంటాడుతోంది.
Telangana: ఒకవైపు కరోనాతో దేశమంతా అల్లాడిపోతుంటే... దానికి బ్లాక్ ఫంగస్ కూడా తోడై కోవిడ్ బాధితులను వెంటాడుతోంది. కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వలన ఈ ఫంగస్ వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు అంటున్నారు. కరోనా వచ్చి తగ్గిన వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఆ సమయంలో బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఎక్కువ. ఇది పాతదే అయినప్పటికీ ఈ కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల కరోనా తగ్గినా కూడా బాధితుల్లో బ్లాక్ ఫంగస్ ఉంటుందనే కోణంలో వారిని పరీక్షించాల్సి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.
బ్లాక్ ఫంగస్‌ని నోటిఫైబుల్ వ్యాధిగా తెలంగాణ సర్కారు ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనా తప్పక ప్రభుత్వానికి సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రతి రోజూ ఆయా ఆస్పత్రుల్లో నమోదైన బ్లాక్ ఫంగస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారి వివరాలు ఆరోగ్య శాఖకు అందించాల్సి ఉంటుందని ప్రభుత్వం వివరించింది.