Telangana: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. మూడు నెలల్లో ప్రక్రియ ప్రారంభం
Indiramma Housing Scheme: ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనపై దృష్టి పెట్టింది.
Indiramma Housing Scheme: ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనపై దృష్టి పెట్టింది. దీనిపై ప్రభుత్వ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు ఇళ్ల నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రెండు పడక గదుల ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.7,740 కోట్లు కేటాయించింది.
ఈ మేరకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. లబ్ధిదారులు అధికారుల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ నిధులను నాలుగు దశల్లో ప్రభుత్వం విడుదల చేస్తుందని పేర్కొంది. పథకాన్ని ఈ ఏడాది మార్చి 11వ తేదీన భద్రాచలంలో సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఇళ్ల నమూనాలనూ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించటంతో హడ్కో సుమారు రూ.1,000 కోట్లు రుణంగా మంజూరు చేసింది. పట్టణ ప్రాంతాల ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత మొత్తం అందుతుంది. ఆయా లెక్కలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.
ప్రతి ఏటా 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన అయిదేళ్లలో 22.50 లక్షల ఇళ్లు నిర్మించేందుకు అవకాశం ఉంది. వచ్చిన దరఖాస్తులు 82.82 లక్షలు ఉన్నాయి. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకున్న మీదటే ముందడుగు వేయాలని అధికారులు భావిస్తున్నారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేసే క్రమంలో ఇతర రాష్ట్రాలు అమలుచేస్తున్న గృహ నిర్మాణ పథకాల విధివిధానాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయమై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పథకం అమలులో ఆయా రాష్ట్రాల అనుభవాలనూ పరిగణనలోకి తీసుకోవటం ద్వారా రాష్ట్రంలో పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని నిర్దేశించారు. ఈ క్రమంలో అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాలు వేర్వేరు రాష్ట్రాల్లో పర్యటించనున్నాయి. ఏడాదికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించాలని సర్కారు నిర్ణయించింది. మిగిలిన 33,500 ఇళ్లను రిజర్వు కోటా కింద ఉంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. దరఖాస్తులతో పోలిస్తే మంజూరుచేసే ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ‘గతంలో సిద్ధమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కొన్నింటిని లాటరీ విధానంలోనే లబ్ధిదారులకు కేటాయించారు. అదే విధానాన్ని అనుసరిస్తే వివాదాలకు దూరంగా ఉండవచ్చు అని ప్రభుత్వం భావిస్తోంది.