ఒమిక్రాన్‌పై మరింత అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. కఠిన ఆంక్షలు...
Omicron Cases: థర్మా మీటర్, థర్మల్ స్కానర్లతో ఎంట్రీ పాయింట్ల వద్ద స్ర్కీనింగ్, మాస్క్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా
Omicron Cases in Telangana: తెలంగాణలో ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుదల దృష్ట్యా విపత్తు నిర్వహణ చట్టం కింద విధించిన ఆంక్షలను ఈ నెల పదో తేదీ వరకు అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డిసెంబరు 25 నుంచి జనవరి 2వతేదీ వరకు ఆంక్షలు విధిస్తూ గతంలో ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో గడువు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాలీలు, బహిరంగ సభలు, మతపరమైన, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం విధించింది.
ఒమిక్రాన్, కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తెలంగాణలో విధించిన ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ర్యాలీలు, బహిరంగ సమావేశాలు సహా జన సమూహ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని ఆదేశాలిచ్చారు. కరోనాపై ఆయన బీఆర్‌కే భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజా రవాణాలో, దుకాణాలు, మాల్స్, సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
ఆయాచోట్ల వినియోగదారులు భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలి. కార్యాలయాలు, పాఠశాల ఆవరణలను తరచుగా శుభ్రంచేయాలి. ఐఆర్ థర్మామీటర్, థర్మల్ స్కానర్, శానిటైజర్ అందుబాటులో ఉంచాలి. పాఠశాలల్లో సిబ్బంది, విద్యార్థులు మాస్కులు ధరించేలా విద్యా సంస్థల యాజమాన్యాలు చొరవ చూపాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై వెయ్యి జరిమానా విధించాలని మార్గదర్శనం చేశారు.